కరోనా జోరు..నేతల తీరు..

by  |

• ఓ పక్క కరోనా వ్యాప్తి
• మరో పక్క లాక్‌డౌన్
• ఇబ్బందులు పడుతున్న పేదలు
• ప్రాణాలు పణంగా పెడుతున్న
హెల్త్ కేర్ సిబ్బంది
•ఫన్నీ పోస్టులకే పరిమితమవుతున్న
చాలా మంది నేతలు
•యాక్టివ్‌గా పనిచేస్తున్న మరికొందరు

దిశ, న్యూస్ బ్యూరో : దేశంలో ఓ పక్క కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ కొనసాగుతుంటే మరో పక్క కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయి ఆర్థిక వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో మద్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు పలు ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలే పేద దేశమైన ఇండియాలో వీరందరికీ రోజూ సరైన ఉపాధి దొరకడమే కష్టమనే పరిస్థితుల్లో ఉద్యోగాలున్న వారు సైతం ఇంట్లో ఉండాల్సిన తప్పినిసరి పరిస్థితి వచ్చపడింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మార్చినెలలో పనిచేయని రోజులకు జీతం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సంఘటిత రంగంలో పనిచేసే వాళ్లకు ఈ నెల వేతనాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ అసంఘటిత రంగంలో రోజువారి పనిచేసే కార్మికులకు పని, వేతనం రెండు లేకుండా పోయాయి. నెల జీతం వస్తుందనే ఆశలున్న వాళ్లకు సైతం ప్రస్తుత లాక్ డౌన్ వల్ల రెగ్యులర్ సరఫరా లేక పెరిగిన కూరగాయల, నిత్యావసర వస్తువుల ధరలతో జేబులకు మామూలు రోజుల్లో కంటే ఎక్కువ చిల్లు పడుతోంది. ఇక దేశంలోని వలస కూలీల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. వలస వెళ్లిన చోట పనులు ఆగిపోయి సొంత ఊరికి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక కాలినడకనే వందల కిలో మీటర్లు వెళుతున్నారు.

ఓ పక్క దేశంలోని పేదలు ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొటుంటే మరోపక్క దేశంలోని ఆస్పత్రుల్లో ఉన్న అరకొర వసతులతోనే వైద్య సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కరోనా రోగులతో పాటు ఇతరులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి కనీసం సరిపడినన్ని వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రధాన మంత్రి నుంచి మొదలుకొని అందరు మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి దేశంలో సరిపడా వనరుల్లేవని కారణాలు చెబుతున్నారు. ఏప్రిల్ 14 దాకా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించినపుడు మాత్రం వైద్య ఆరోగ్య సిబ్బంది అవసరాల కోసం రూ.15వేల కోట్లు ఇస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఇక ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం దేశంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు పలు రకాల ఆహార ధాన్యాలను సాధారణంగా ఇచ్చేదానికంటే ఎక్కువ పరిమాణంలో ఏప్రిల్ నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. బియ్యం, గోధుమలు, పప్పు లాంటి ఆహారధాన్యాలతో పాటు కొద్దిపాటి నగదు ఇవ్వనున్నట్టు వెల్లడించాయి.

ఓ పక్క కరోనా లాంటి భయంకరమైన వైరస్ వ్యాప్తి, మరో పక్క లాక్‌డౌన్ లతో పరిస్థితి దేశంలో దారుణమైన పరిస్థితి నెలకొంటే దేశంలో ప్రజలు ఓటువేసి ఎన్నుకున్న నేతలు ఏంచేస్తున్నట్లని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారు లాక్‌డౌన్, కర్ఫ్యూల పేరు చెప్పి ఇళ్లలో కుటుంబసభ్యులతో హాయిగా గడపడమే కాకుండా సోషల్ మీడియాలో ఆ పిక్‌లను ఫాలోవర్స్‌కు షేర్ చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న దేశంలోని ఆరోగ్య సిబ్బందిని పరామర్శించడం కానీ, మాస్కులు ధరించి ఆస్పత్రులకు వెళ్లి సందర్శించడం లాంటి పనులు చేస్తే వారికి నైతిక బలమిచ్చినట్టుంటుందని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మూతపడడం వల్ల పలు రకాల సమస్యలెదుర్కొంటున్న పేద ప్రజలను కలిసి వారి సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేస్తే వారిని ఎన్నుకున్నందుకు ప్రజలు సంతోషిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా పలువురు నేతలు సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు పెట్టి విమర్శల పాలయ్యారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం రోజు దూరదర్శన్‌లో చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రసారమవుతున్న రామాయణం సీరియల్ చూస్తూ హాయిగా ఇంట్లోని సోఫాలో రిలాక్స్ అవుతున్నఫోటో ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి విమర్శకులు ఘాటుగా స్పందించారు. ప్రజలు ఓ పక్క బాధపడుతుంటే మీరు మాత్రం ఇంట్లో హాయిగా రిలాక్స్ అవుతున్నారా అని రిప్లై ఇచ్చారు. దీంతో జవదేకర్ ఆ పోస్టును డిలీట్ చేశారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజెజు లాక్ డౌన్‌లో ఫిట్‌గా ఉండడమెలా అని తాను స్కిప్పింగ్ చేస్తున్న ఫొటో పెట్టారు. మీరు ఇలానే చేయండని ఫాలోవర్స్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ఇక మరికొందరు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ వంట చేస్తున్న ఫొటోలు షేర్ చేశారు. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌తో సహా ఏ ఒక్క మంత్రి ఏ ఒక్క ఆస్పత్రిని సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బందిని పరామర్శించిన పాపాన పోలేదు.

కాగా, కొందరు నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం స్వయంగా తానే కోల్ కతాలోని ఓ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి ప్రజలకు సోషల్ డిస్టెన్స్ పాటించడమెలా అన్నది నేర్పించారు. స్వయంగా తానే గుండాలు గీసి ఒకరికొకరు దూరంగా వాటిలో నిలబడాలని సూచించారు. మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే సోషల్ మీడియాలో టైంపాస్ పోస్టులు పెట్టకుండా యాక్టివ్‌గా ఆస్పత్రులను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర మంత్రి సృతి ఇరానీ తన వంతు సాయంగా తన నియోజకవర్గం అమేథీలోని పేద ప్రజలకు ఫుడ్ ప్యాకెట్లు పంపించారు.

Tags: corona, lock down, poor people, healthcare workers, political leaders, social media posts



Next Story

Most Viewed