బీజేపీలో చర్చకు దారితీసిన ఈటల ఇష్యూ.. షా పర్యటనకు ముందు పార్టీలో ప్రకంపనలు

by Disha Web Desk |
బీజేపీలో చర్చకు దారితీసిన ఈటల ఇష్యూ.. షా పర్యటనకు ముందు పార్టీలో ప్రకంపనలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోం మంత్రి, బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా శనివారం తెలంగాణలో పర్యటించబోతున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యే తీరు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర-2 ముగింపు సభ సందర్భంగా హైదరాబాద్ శివార్‌లోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం భారీగా జన సమీకరణ చేపట్టాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కింది స్థాయి నేతలకు ఆదేశాలు సైతం వెళ్లాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమిత్ షా ఈ సభ ద్వారా కీలక ప్రకటనలు చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలంతా అమిత్ షా సభపై ఫోకస్ పెడితే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురువారం ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా చర్చకు దారి తీసింది.

అక్కడ బీజేపీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) శివ ప్రకాష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ లను వేర్వేరుగా కలిశారు. ఈటల ఆకస్మికంగా హస్తినా బాట పట్టడం రాజకీయ వర్గాల్లో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి ఉందని, దాన్ని బీజేపీ ఎలా అనుకూలంగా మలచుకోవాలనే అంశాలతో పాటు పార్టీలో తనతో పాటు ఇతర సీనియర్ నేతల సేవలను సక్రమంగా వినియోగించుకోని తీరుపై వారికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈటల వ్యవహారం రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లిన ఈటల అక్కడ వారితో ఏం చెప్పారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ పార్టీలో సుధీర్ఘ కాలం పని చేసిన వ్యక్తిగా ఆ పార్టీ బలాలు, బలహీనతలతో పాటు సీఎం కేసీఆర్ ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారో అనే అంశాలపై ఈటలకు అవగాహన ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉండటంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నాయో అతడు అంచనా వేయగలడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సీక్రెట్లు, ఇతర వివరాల సమాచారం చేరవేయడానికే ఢిల్లీకి వెళ్లి ఉంటారని కొంత మంది చర్చించుకుంటున్నారు.

ఇక మరికొంత మంది మరోలా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈటల సీనియర్ నేత. అపార అనుభవం కలిగిన వాడిగా, ఉద్యమ కారుడిగా గుడ్ విల్ ఉంది. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చాక అతడికి సరైన గౌరవం లభించడం లేదని అందువల్లే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ గెలుపుకు తన లాంటి సీనియర్లు, ఉద్యమకారులను సమర్ధవంతగా ఉపయోగించుకోవాలని చెప్పేందుకే వెళ్లారని మరి కొంత మంది చెప్పుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీలో సీనియర్లు, జూనియర్లు అనే మాట తరచూ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడానికే ఢిల్లీకి వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది.

బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీలోకి చేరికలను ప్రోత్సాహించాలని సూచించారు. పార్టీలోకి రావాలనుకునే వారిని ఎవరూ అడ్డుకోవద్దని దిశా నిర్దేశం చేశారు. సో.. అమిత్ షా సభ వేదికగా ఈటల పాత మిత్రులు ఎవరైనా కాషాయం తీర్ధం పుచ్చుకోబోతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో రేపు అమిత్ షా వస్తుండగా ఈటల ఢిల్లీ టూర్ పై ఇటు బీజేపీలోను అటు ఇతర రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed