ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్ తెలుసా?

by  |
ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్ తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: రంగురంగుల లైట్‌లు, ఆకాశానికి ఎగిసిపడుతున్న నీళ్లతో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్‌గా రికార్డు సృష్టించింది. దుబాయ్ వాటర్‌ఫ్రంట్ పామ్ జుమేరా ప్రాంతంలోని ద పాయింటే వద్ద ఉన్న ఈ పామ్ ఫౌంటెయిన్ ఆవిష్కరణను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమ్ చేశారు. 14,000 చదరపు అడుగుల వ్యాపించి ఉన్న ఈ ఫౌంటెయిన్‌ను నఖీల్ మాల్స్ వారు అభివృద్ధి చేశారు. 128 సూపర్ షూటర్‌లతో 105 మీటర్ల ఎత్తు వరకు నీటిని వెదజిమ్మగలవని నఖీల్ మాల్స్ ఆసెట్ డైరెక్టర్ గెయిల్ సాంగ్‌స్టర్ తెలిపారు.

ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ఫౌంటెయిన్‌గా ఉన్న దక్షిణ కొరియాలో ఉన్న బాంపో మూన్‌లైట్ రెయిన్‌బో ఫౌంటెయిన్‌ పేరున ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను ఈ పామ్ ఫౌంటెయిన్ తిరగరాసింది. 3,000 ఎల్‌ఈడీ లైట్లతో ఈ ఫౌంటెయిన్ సంవత్సరంలో అన్ని రోజులు పర్యాటకులను ఆకట్టుకోనుంది. మూడు నిమిషాల వాటర్ డ్యాన్సింగ్‌తో ప్రతి 30 నిమిషాలకు ఒక డ్యాన్స్ షోను పామ్ ఫౌంటెయిన్ ప్రదర్శించనుంది. కొవిడ్ కారణంగా తగ్గిపోయిన పర్యాటక రంగ లాభాలను తిరిగి తెచ్చుకోవడానికి దుబాయ్‌లో ఇలాంటి సరికొత్త ఆకర్షణలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed