ఈ మండలాన్ని కాపాడేదెవరు..?

by  |
Kabjadhaarulu-1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో కొంతమంది వ్యక్తుల అక్రమ దందాలతో మండలం అస్తవ్యస్తంగా మారింది. మండలంలో పేదప్రజల భూములు, ఇండ్లు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులతో కుమ్మక్కై మండలాన్ని శాసిస్తున్నారని ఇక్కడి జనం చెవులు కొరుక్కుంటున్నారు. మండలంలో ఎక్కడ చూసినా పేద ప్రజల భూములను కబ్జా చేస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మణుగూరు మండలం రోజురోజుకి అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు పేదప్రజల భూములపై కన్ను వేసి కబ్జా చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూములనే నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటి అంటూ పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల భూములను కబ్జా చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదు. అంతేకాదు కొంతమంది అధికారులే కబ్జాకోరులకే వత్తాసు పలుకుతున్నారు. తమ భూమి కబ్జాకు గురయ్యిందని పోలీస్ స్టేషన్ కి వెళ్లినా.. కోర్టుకు వెళ్లిన న్యాయం జరగడం లేదని.. లోకల్ అధికార పార్టీ నాయకులకు, ప్రభుత్వాధికారులకు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వడంతోనే కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవడంలేదని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు ముడుపులకు కుమ్మక్కై కబ్జా చేసినవారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతోనే మండలంలో కబ్జాలు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు ముడుపులకు కక్కుర్తి పడి పేదవాడి భూముల పట్టాలను వేరే వ్యక్తులకు దొంగతనంగా మార్చడం మండలంలో సర్వసాధారణమైపోయింది. ఇంత జరుగుతున్నా.. మండల ప్రజలను, మండలాన్ని కాపాడేదెవరూ లేరా అని పలువురు మేధావులు, స్థానిక జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు భూములను కబ్జా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోని, ఇకముందు కబ్జాలు జరగకుండా చూడాలని పేదప్రజలు, మేధావులు కోరుతున్నారు.


Next Story

Most Viewed