ఫేక్ ప్రచారం ఉధృతంగా ఉంది.. అంతా సర్దుకుంది: కన్నబాబు

by  |
ఫేక్ ప్రచారం ఉధృతంగా ఉంది.. అంతా సర్దుకుంది: కన్నబాబు
X

దిశ ఏపీ బ్యూరో: ఎల్జీ పాలిమర్స్‌లో చోటుచేసుకున్న దుర్ఘటనపై విశాఖపట్టణంలో ఫేక్ సమాచారం ఉధృతంగా ఉందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వైజాగ్‌లో పలువురు మంత్రులతో కలిసి కేజీహెచ్‌లో బాధితులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భయాందోళనలతో ఉన్న వేళ అవాస్తవ సమాచారంతో ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని కోరారు.

నిన్న రాత్రి గ్యాస్ లీకేజీ మరోసారి జరిగిందని, బ్లాస్ట్ కూడా జరిగిందంటూ ప్రచారం జరిగిందని, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. పూణే, నాగపూర్, గుజరాత్ నుంచి వచ్చిన నిపుణులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ తెరవాలా? వద్దా? అన్నది నిపుణులు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.

బాధిత గ్రామాల ప్రజల కోసం షెల్టర్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాధితులెవరూ ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. మంచి భోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎల్జీ పాలిమర్స్‌లో బ్లాస్ట్‌ అయ్యే అవకాశం లేదని నిపుణులు వెల్లడించినట్టు చెప్పారు. విషవాయువును అదుపులోకి తెస్తున్నారని, స్టైరీన్‌ను నిల్వ ఉంచిన ట్యాంకులో ఉష్ణోగ్రతను అదుపులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.

కేజీహెచ్‌లో బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. బాధితుల్లో 41 మంది చిన్నారులు ఉండడం బాధాకరమని ఆయన చెప్పారు. మరో 190 మందికి కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మరో వంద మందికిపైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. వీరందరికీ ముప్పు తప్పిందని ప్రకటించారు. వారిని కాపాడేందుకు వైద్యులు చాలా శ్రమించారని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

tags: kurasala kannababu, botsa satyanarayana, avanthi srinivas, ysrcp

Next Story

Most Viewed