సిద్ధిపేటకు కేటీఆర్ దూరం..

by  |
సిద్ధిపేటకు కేటీఆర్ దూరం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సిద్ధిపేటకు మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ నెల30 మున్సిపాలిటీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంతో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార బాధ్యతను మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. అందులో మాత్రం కేటీఆర్ ఎలాంటి జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కానీ, సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రం వెళ్లలేదు. అదే విధంగా నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించగా, అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచార బాధ్యతను ఆయనే నిర్వహించనున్నారు.

కార్పొరేషన్, మున్సిపాలిటీల ఇన్‌చార్జులు..

రాష్ట్రంలో ఎన్నికలు జరిగే రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీలకు టీఆర్ఎస్ ఇన్‌చార్జులను నియమించింది. ఖమ్మం కార్పొరేషన్‌కు ఇన్‌చార్జిగా మంత్రి పువ్వాడ అజయ్, వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, కొత్తూరులో వి. శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేటలో నిరంజన్‌ రెడ్డి, నకిరేకల్ లో మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిలు ఎన్నికయ్యారు. ఇన్‌చార్జులు అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తారు. అభ్యర్థుల గెలిపించుకునే బాధ్యత కూడా అధిష్టానం వీరికి అప్పగించింది.


Next Story