సిబ్బంది నిర్లక్ష్యం…కొవిషీల్డ్‌కి బదులు కోవాగ్జిన్

by  |
సిబ్బంది నిర్లక్ష్యం…కొవిషీల్డ్‌కి బదులు కోవాగ్జిన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. గతంలో ఓసారి నిర్వహించగా.. ఒక్కరోజులో 6 లక్షల వ్యాక్సిన్లు వేశారు. తాజాగా ఆదివారం ప్రభుత్వం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. ఒక్కరోజే 13,68,049 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వైద్య సిబ్బంది. కొన్ని జిల్లాలు అయితే రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేశారు. చిత్తూరు జిల్లాలో అయితే 1,02,862 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అందరిలో ఆందోళన కలిగింది.

జిల్లాలోని పెనుమూరు మండలం గుడ్యాణంపల్లెలో మొదటి డోస్ కొవిషిల్డ్ తీసుకున్న వారికి ఆదివారం మెగా డ్రైవ్‌లో రెండో డోస్ కోవాగ్జిన్ టీకా ఇచ్చారు. రెండో డోస్ తీసుకునేందుకు వచ్చిన వారిలో 31 మందికి కోవాగ్జిన్ టీకా ఇచ్చారు. వ్యాక్సిన్ వివరాలు ఆన్ లైన్‌లో నమోదు చేస్తుండగా విషయం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. వేర్వేరు వ్యాక్సిన్లు వేసిన ఆ 31 మందిని అబ్జర్వేషన్‌లో పెట్టారు. రెండు డోస్‌లు వేరు వేరు వ్యాక్సిన్లు వేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అధికారులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.



Next Story