స్విస్ ఓపెన్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్, పీవీ సింధు

by  |
Kidambi
X

దిశ, స్పోర్ట్స్: స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత షట్లర్లు విజయాలతో దూసుకుపోతున్నారు. నాలుగో సీడ్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన థామస్ రాక్సెల్‌పై 21-10, 14-21, 21-14 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తొలి సెట్‌ను 21-10 గేమ్స్ తేడాతో గెలిచిన తర్వాత.. శ్రీకాంత్ రెండో సెట్ కోల్పోయాడు. కాని వెంటనే పుంజుకొని మూడో సెట్ కైవసం చేసుకొని మ్యాచ్ గెలిచాడు. 52 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ గతం కంటే మెరుగైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇక 5వ సీడ్ సాయి ప్రణీత్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో అబియన్‌ను 21-12, 21-17 తేడాతో 37 నిమిషాల్లో ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. యువ షట్లర్ అజయ్ జయరామ్ డెన్మార్క్‌కు చెందిన 3వ సీడ్ రాస్మస్ గెమ్కీని ఓడించి క్వార్టర్స్ చేరాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో అజయ్ 21-18, 17-21, 21-13 తేడాతో విజయం సాధించాడు. అయితే సౌరభ్ వర్మ మాత్రం 8వ సీడ్ థాయిలాండ్ ఆటగాడు కున్లవుత్‌ చేతిలో 17-21, 14-21 తేడాతో రౌండ్ రౌండ్‌లో ఓడిపోయాడు.

మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్ పీవీ సింధు అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్‌ను కేవలం 35 నిమిషాల్లో 21-13, 21-14 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి జోడి ఇండోనేషియా జోడి ప్రముద్య-రాంబిటన్‌లను 21-17, 20-22, 21-17 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప జోడి ఇండోనేషియాకు చెందిన రివాల్డి-మెంటారీ జోడీని 21-18, 21-16 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

మహిళల డబుల్స్‌ జోడి అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి డెన్మార్క్‌కు చెందిన మెగ్లాండ్-రావ్న్‌ చేతిలో 11-21, 15-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన చైవాన్ చేతిలో 16-21, 21-17, 21-23 తేడాతో ఓటమి పాలయ్యింది. రెండు మ్యాచ్ పాయింట్లు సైనా చేతిలో ఉన్నా.. తనకంటే 10 ఏళ్లు జూనియర్ అయిన చైవాన్ చేతిలో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యలో ముంచెత్తింది. సైనా భర్త పారుపల్లి కశ్యప్ కూడా తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. ఈ ఓటములు వీరిద్దరి ఒలంపిక్స్ అర్హతపై ప్రభావం పడనున్నది.



Next Story

Most Viewed