ఖమ్మం టాప్, ఆదిలాబాద్​లాస్ట్.. ఒక్క వైన్‌కు 118 దరఖాస్తులు

by  |
Wines
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. టెండర్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగింది. మొత్తం 262‌‌0 దుకాణాలకు 67,849 అప్లికేషన్లు రాగా.. గురువారం ఒక్కరోజే 37,160 టెండర్లు దాఖలయ్యాయి. అప్లికేషన్​ ఫారాల ద్వారానే ప్రభుత్వానికి రూ. 1357 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో షాపునకు సగటున 26 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఖమ్మం ఎక్సైజ్​ డివిజన్‌లో టెండర్లు వేశారు. ఖమ్మం డివిజన్‌లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుండగా.. ఈ రెండు జిల్లాల పరిధిలో 210 వైన్​ షాపులున్నాయి. ఖమ్మంలో 122 షాపులకు 6212 అప్లికేషన్లు రాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 దుకాణాలకు 4271 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ సగటున ఒక్కో దుకాణానికి 49 మంది, ఖమ్మంలో 51 మంది పోటీ పడుతున్నారు.

ఆ తర్వాత శంషాబాద్​పరిధిలో 100 షాపులకు 4122, సరూర్​నగర్​ఈఎస్​పరిధిలో 134 షాపులకు 4102, నల్లగొండలో 155 షాపులకు 4079 టెండర్లు వేశారు. ఇక అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా అప్లికేషన్లు వచ్చాయి. నిర్మల్​ జిల్లాలో 47 దుకాణాలకు 556, ఆదిలాబాద్​లో 40 షాపులకు 591, ఆసిఫాబాద్​లో 32 షాపులకు 623 దరఖాస్తులు వచ్చాయి. వనపర్తిలో 37 దుకాణాలకు 692 దాఖలు చేశారు.

ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలోని మద్యం దుకాణానికి 118 దరఖాస్తులు దాఖలయ్యాయి. మధిరలోని రాజుపాలెం మద్యం దుకాణానికి 117 దరఖాస్తులు, ఎర్రుపాలెంలోని 77 నెంబర్‌ దుకాణానికి 116 దరఖాస్తులు రావడం విశేషం. కర్నూల్​ సరిహద్దులోని జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, ఉండవల్లి మద్యం దుకాణాలకు కూడా ఎక్కువగా టెండర్లు దాఖలయ్యాయి.

అమ్మకాలు కూడా ఎక్కువే

కర్నూలుకు సరిహద్దుల్లో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి గ్రామంలో మద్యం దుకాణం అమ్మకాల్లో నంబర్‌-1 స్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో రెండు సంవత్సరాల్లోనే రూ.64 కోట్ల మద్యాన్ని విక్రయించింది. అలంపూర్​పరిధిగా అక్కడే ఉన్న మరో వైన్‌ షాపు రూ.58 కోట్ల మద్యాన్ని అమ్మింది. ఈ లెక్కన ఉండవెల్లి గ్రామంలోనే రూ.122 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఏపీ సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ పల్లెలు గత రెండేళ్లలో సగటున రూ.50 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిపాయి.

రాష్ట్రంలోని మిగతా మద్యం దుకాణాలతో పోలిస్తే వీటి టర్నోవర్‌ చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన పట్టణాల్లో మద్యం దుకాణాలను మించిన స్థాయిలో ఏపీ సరిహద్దు గ్రామాల్లోని వైన్‌ షాపుల టర్నోవర్లు పెరిగిపోయాయి. పొరుగున ఉన్న ఏపీకి వాటి నుంచి పెద్దఎత్తున మద్యం సరఫరా జరగుతోంది. ఏపీలో ఊరు, పేరు లేని బ్రాండ్ల మద్యాన్ని అమ్ముతుండటం, సరిహద్దులోని తెలంగాణ గ్రామాల మద్యం షాపుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా బ్రాండెడ్‌ మద్యం స్టాక్‌ను తీసుకెళ్తున్నారు. దీంతో ఏపీ సరిహద్దులోని నల్లగొండ, ఖమ్మం, జోగుళాంబ గద్వాల జిల్లాల సరిహద్దు గ్రామాల వైన్‌ షాపుల వ్యాపారం రెండింతలుగా జరుగుతోంది.

సాధారణంగా రాష్ట్రంలోని మండల కేంద్రాల్లోని దుకాణాల్లో సగటున రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దుకాణాల్లో సగటున రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు మద్యం అమ్ముడువుతుంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆరో దుకాణంలో అత్యధికంగా రూ.60 కోట్ల అమ్మకాలు జరగగా, మిగతా అన్ని దుకాణాల్లో రూ.35 కోట్లలోపే మద్యం అమ్ముడైంది. హైదరాబాద్‌, ఇతర నగరాల దుకాణాల్లో కన్నా.. ఆంధ్ర సరిహద్దు జిల్లాల మద్యం దుకాణాల్లో ఎక్కువగా సేల్స్‌ జరగడం గమనార్హం. ఈనేపథ్యంలో అధిక రాబడి ఉన్న సరిహద్దు మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.

జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని అలంపూర్‌ మునిసిపాలిటీలో ఒక మద్యం దుకాణం ఉండగా.. అందులో రూ.50 కోట్ల అమ్మకాలు జరిగాయి. వడ్డేపల్లి మునిసిపాలిటీలోని మద్యం దుకాణంలో రూ.40 కోట్ల వరకు మద్యం అమ్ముడైంది. కృష్ణా జిల్లాకు సరిహద్దుగా ఉన్న కోదాడ మునిసిపాలిటీలోని మద్యం దుకాణాల్లోనూ భారీగా అమ్మకాలు జరిగాయి. కోదాడ మండలం నల్లబండగూడెంలోని దుకాణంలో రూ.52 కోట్ల మద్యం అమ్ముడైంది. గుంటూరుకు సరిహద్దుగా ఉన్న నల్లగొండ జిల్లాలోని మద్యం దుకాణాల్లో కూడా అంతే. పెద్దవూర మద్యం దుకాణం-1లో రూ.40 కోట్ల వరకు, మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో 12 మద్యం దుకాణాలుండగా.. సగటున రూ.20 కోట్ల మద్యం అమ్ముడైంది. అడవిదేవులపల్లిలోని మద్యం దుకాణంలోనూ రూ.40 కోట్ల వరకు అమ్మారు.

ఖమ్మం జిల్లా కల్లూరులోని నాలుగు మద్యం దుకాణాల్లో దాదాపు రూ.90 కోట్లు, కామెపల్లిలో రూ.55 కోట్లు, ఎర్రుపాలెంలోని ఓ మద్యం దుకాణంలో రూ.25 కోట్ల మద్యం సేల్స్‌ జరిగింది. ఆంధ్ర సరిహద్దులోని అశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి, తల్లాడ, ముదిగొండ, చింతకాని, బోనకల్‌, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నాగార్జునసాగర్‌, తదితర మద్యం దుకాణాల్లో అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు.

లాటరీ ద్వారా ఎంపిక

మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన వ్యాపారుల్లో అదృష్టవంతులెవ్వరో శనివారం తేలనుంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో.. శనివారం ఉదయం నుంచే లాటరీ ద్వారా దరఖాస్తులను ఎంపిక చేసి దుకాణాలు కేటాయిస్తారు. దీనికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, లాటరీలో ఎంపికైన తర్వాత ఎవరైనా ముందుకు రానట్లయితే వారికి రూ.5 లక్షల జరిమానా విధించనున్నట్లు అధికారులు మరోసారి ప్రకటించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story