నడవలేడు.. కెన్‌(టా) డ్యాన్స్‌

by  |

దిశ, వెబ్‌డెస్క్‌: సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ.. ఏదీ అసాధ్యం కాదు. అవరోధాలు ఎదురైనా.. విధి వెక్కిరించినా.. అదృష్టం వరించికపోయినా.. ఏం పర్వాలేదు.. ముందుకు సాగుతూ పోతే.. విజయం వచ్చిఒడిలో చేరుతుంది. అందుకు కెంటా కంబారా జీవితమే ఓ నిదర్శనం. కాళ్లు ఉన్నా నడవలేడు. దేహమున్నా..అర్ధభాగం పనిచేయదు. అందరిలా.. అతడు అన్ని పనులు చేసుకోలేడు. ఇవన్నీ మనకు కనిపిస్తున్న నిజాలు. కానీ, కెంటా కంబారాకు అవేవీ కనపడవు. కారణాలు, సాకులు లెక్కపెట్టుకుంటూ అక్కడే ఆగిపోలేదు అతడు. అవేవి తన లక్ష్యానికి అడ్డుకావని బలంగా నమ్మాడు. వైకల్యం తన దేహానికి మాత్రమే.. తన మనసుకు కాదని కంబారాకు తెలుసు. అందుకే అతడు మనందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేసే కంబారా.. ప్రపంచ దేశాల అథ్లెట్స్ పాల్గొనే.. 2020 టోక్యో ఒలింపిక్స్ ఓపెనింగ్ లేదా క్లోజింగ్ సెర్మనీలో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలిచే కెంటా కంబారా జీవితంలోకి మనమూ ఓ సారి తొంగి చూద్దాం.

కెంటా కంబారా జపాన్‌లో జన్మించాడు. అతడికి పుట్టుకతోనే స్పైనా బైఫిడా అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి వల్ల అతడి శరీరంలోని నడుము కింది భాగం అసలు పనిచేయదు. స్పర్శ కూడా తెలియదు. ఆ పార్ట్ అంతా చచ్చుబడిపోయింది. అతడు నడవలేడు. చక్రాల కుర్చీకే పరిమితం. కానీ, కంబారాకు ఆ విషయాలేం తెలియవు. అతడు మూడో గ్రేడ్‌లో ఉండగా వాళ్లమ్మ అతడితో.. నువ్వు ఎప్పటికీ నడవలేవు అనే నిజాన్ని చెప్పింది. ఆ విషయం చెప్పగానే కంబారా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. త్వరలోనే ఆ షాక్ లోంచి తేరుకున్నాడు. కానీ, ఆ కఠోర వాస్తవమే తన జీవితాన్ని మరో కోణంలో ఆలోచించేలా చేసింది. ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు స్వాగతం పలుకుతుందని నమ్మే కంబారా.. లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు మరెన్నో భిన్నమైన దారులున్నాయని గ్రహించాడు. అందుకు అనుగుణంగా తన జీవితాన్ని మలచుకున్నాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు ఇలా అందరితో స్నేహంగా ఉండేవాడు. ఐదేళ్ల క్రితం నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. రియో పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకోవడంతోపాటు, ప్రశంసలు అందుకున్నాడు. ఒకప్పుడు ఏ వీల్ చెయిర్ అయితే తనకు డిస్ కంఫర్ట్‌గా ఉందని భావించాడో.. ఇప్పుడు అదే తన డ్యాన్స్ ప్రదర్శనకు సహాయమవుతుంది. వీల్ చెయిర్‌ను ఆసరా చేసుకునే కంబారా డ్యాన్స్ చేస్తున్నాడు.

దానిపైనే గెంతులేస్తున్నాడు, అందరూ ఆశ్చర్యపోయే విన్యాసాలు చేస్తున్నాడు. చక్రాల కుర్చీకే పరిమితం కావడం చాలా భారంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఎంతో బాగుందని కంబారా అంటాడు. చచ్చుబడిపోయిన తన కాళ్లను నలుగురికీ చూపించలేక అవమానంతో కుంగిపోయేవాడు. తల్లిదండ్రులు గురువుల సాయంతో అంగవైకల్యం అవమానకరం కాదని తెలుసుకున్నాడు, ప్రస్తుతం ఆ కాళ్లనే తన డ్యాన్స్‌కు ఉపయోగించుకుంటున్నాడు. అంగవైకల్యాన్ని అందరూ ప్రతికూలంగా భావిస్తారని, అలాంటి ఆలోచనలు మనలోకి రాకుండా చూసుకోవాలని, అందరిలా మనం కూడా ఏదైనా సాధించవచ్చని కంబరా అంటాడు. పారాలింపిక్స్‌లో డ్యాన్స్ విషయానికి వస్తే ఇది తనలాంటి వాళ్లు మాత్రమే చేయగలరని. ఒకప్పుడు నేనేం దాచేయాలనుకున్నానో ఇప్పుడదే ప్రజల హృదయాలకు చేరువైంది అని అంటున్నాడు. అందరిలో ప్రేరణ నింపేందుకు ప్రాథమిక పాఠశాలల్లో కంబారా డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. చిన్నారులు అతడిని చూసి ఆశ్చర్యపోతుంటారు. అంగవైకల్యంతో పుట్టినప్పటికీ కంబారా ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటాడని ఎంతోమంది విద్యార్థులు కంబార గురించి చెప్పడం విశేషం. ప్రతి ఒక్కరికీ అందరికంటే భిన్నంగా ఉండాలని, తమ పనిలో వైవిధ్యం చూపించాలని ఉంటుదని, కానీ, వాళ్లెవరూ కూడా వైవిధ్యాన్ని అనుభూతి పొంది ఉండరన్నాడు కంబారా. రియో పారాలింపిక్స్ ముగింపు వేడుకలో అద్భుతమైన తన డ్యాన్స్తో అలరించిన తర్వాత కంబారాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. తనకు టోక్యో ఒలింపిక్స్ వేడుకల్లోనూ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దివ్యాంగులైనంత మాత్రాన పారాలింపిక్స్‌లో మాత్రమే నృత్య ప్రదర్శన ఇవ్వాలన్నా విభజన ఉండక్కర్లేదు. అన్ని వేదికల్లోనూ అవకాశం ఇవ్వాలి అని అతడి అభిప్రాయం. తన సొంత దేశంలో జరిగే టోక్యో పారాలింపిక్స్ ఆరంభ లేదా ముగింపు వేడుకల్లో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చేందుకు కంబార సిద్ధమవుతున్నాడు. రోజూ ఆడిటోరియంలో సాధన చేస్తున్నాడు. కరోన వైరస్ కారణంగా ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయో లేదా అనుమానాలు ఏర్పడ్డ నేపథ్యంలో అతడన్న మాటలు ఆలోచింపజేశాయి. ఒలింపిక్స్ రద్దు చేసినా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన చేసేందుకు తనకు మరో అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాళ్లతో నడవడం కుదర లేకపోతే.. చేతులతోనైన నడువు. ఏదో ఒకటి చేయాలనిపించి చేయలేకపోతే.. అక్కడే ఆగిపోవద్దు.. చేసేందుకు మరో దారి వెతుకు అనే మాటలను ప్రేరణగా తీసుకున్న కంబారా .. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Tags: kent kambara, handicap, wheelchair dance, inspire, tokyo olympics

Next Story

Most Viewed