సర్వేల ఎఫెక్ట్.. హుజురాబాద్‌పై సీఎం కేసీఆర్ వ్యూహత్మక అడుగులు

by  |
సర్వేల ఎఫెక్ట్.. హుజురాబాద్‌పై సీఎం కేసీఆర్ వ్యూహత్మక అడుగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్​ రాజకీయాల్లో అధికార పార్టీ పట్టు బిగిస్తున్నది. సెగ్మెంట్​లో అనుకూల వాతావరణం కనిపిస్తున్నదనే ఆశతో ఆ పార్టీ అధినేత వ్యూహం మార్చినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఇక నుంచి ప్రగతిభవన్​ నుంచే డైరెక్షన్స్​ ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటి వరకు మంత్రులు, నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం విదితమే. దీనికి గులాబీ బాస్​ బ్రేక్​ వేయనున్నారు. ఇప్పటి వరకు రెచ్చగొట్టేలా మాట్లాడటం, మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలకు ఇచ్చిన కౌంటర్​లన్నింటిపైనా కేసీఆర్​ దృష్టి సారిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించాయన్నది నిఘా వర్గాల సమాచారం. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రగతిభవన్​ నుంచి సమాచారమిచ్చారు.

ఈటల ప్రాభవం తగ్గుతున్నదా?

హుజూరాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. పలు పథకాలను సైతం అక్కడ ప్రవేశపెట్టింది. అక్కడి నుంచే అమలు చేస్తామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్​ ప్రకటించారు. మరోవైపు ఈటల రాజేందర్​కు సన్నిహితంగా మెలిగిన వారందరినీ తమవైపు లాక్కున్నారు. ఇప్పటికే చాలాసార్లు సర్వే చేయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్​… తాజా నివేదికల్లో ఈటల రాజేందర్​ ప్రాభవం తగ్గుతున్నదనే నిర్ణయానికి వచ్చారు. దానిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రగతిభవన్​ డైరెక్షన్స్​

సర్వేల అంశాలన్నీ ప్రత్యేకంగా పర్యవేక్షించిన కేసీఆర్​.. సెగ్మెంట్​ బాధ్యతలను మంత్రి హరీశ్​రావుకు అప్పగించినట్లు ప్రగతిభవన్​ వర్గాల సమాచారం. ప్రతి వారం సర్వే చేయించుకొని, వాటి ప్రకారం అక్కడ రాజకీయ వ్యూహాలను అమలు చేసే బాధ్యతలను హరీశ్​రావుపై పెట్టారు. ఈ వారం రోజుల వ్యవధిలో మంత్రి హరీశ్​ బృందమే సర్వే నివేదికలు ఇచ్చాయంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న ఈ సర్వేల్లో అధికార పార్టీకి కొంత మెరుగు కనిపిస్తున్నట్లు తేలడంతో గులాబీ శ్రేణుల్లోనూ ఉత్సాహం పెరుగుతున్నది. ఇలాంటి కీలక సమయంలో ఎవరికి వారే ఇష్టానుసారంగా మాట్లాడితే ఇబ్బందులు తప్పవని గుర్తించిన అధినేత కేసీఆర్​… ఇక నుంచి అలాంటి వాటికి బ్రేక్​ వేసినట్లు తెలుస్తున్నది.

కొన్ని పనులకే మంత్రులు

ఇక నుంచి మంత్రులు ఎదురుదాడికి దిగడం, మాటలతో రెచ్చగొట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలంటూ సూచించినట్లు సమాచారం. ఎందుకంటే ఇటీవల ఈటల ఆరోపణలపై ఓ మంత్రి ఎదురుదాడి చేయడంతో.. అది పార్టీకి నష్టం తీసుకువచ్చిందని తేలింది. దీంతో దీనిపై సదరు మంత్రిపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఇక నుంచి ఇష్టానుసారంగా మాట్లాడవద్దంటూ సున్నితంగా హెచ్చరించినట్టు ప్రగతిభవన్​లో చర్చ. ఇప్పుడు హరీష్ చేతికి కీలక పనులు అప్పగించడంతో ఆ జిల్లాకు చెందిన మంత్రులకు కొన్ని ‘ప్రత్యేక’ పనులను కేటాయిస్తున్నారు. పథకాలను లబ్ధిదారులకు చేర్చడంతో పాటు ఉప ఎన్నిక నోటిఫికేషన్​ తర్వాత గ్రామ, మండల స్థాయిలో ఓటర్ల కోసం చేయాల్సిన కొన్ని కీలక పనులకు మాత్రమే ఈ మంత్రులను వినియోగించనున్నారు. అంతేకానీ బహిరంగ విమర్శలు, ఎదురుదాడి వంటి వాటికి దూరం పెట్టనున్నారు.

బీజేపీ సోషల్​ మీడియాకు బ్రేక్​ వేసేదెలా?

హుజురాబాద్​లో టీఆర్​ఎస్​ను వేధిస్తున్న అతిపెద్ద సమస్య బీజేపీ సోషల్​ మీడియా. టీఆర్​ఎస్​ కన్నా బీజేపీ సోషల్​ మీడియా చాలా స్ట్రాంగ్​ ఉండటమే కాకుండా… మంత్రులు చేసే వ్యాఖ్యలు, ప్రకటనలపై వెంటనే అదే వేదికగా దాడి చేస్తున్నారు. దీన్ని అందుకోవడంలో టీఆర్​ఎస్​ పార్టీ వెనకబడుతున్నది. కొంతకాలం కిందట వరకు సోషల్​ మీడియాను పెద్దగా పట్టించుకోని కేసీఆర్​.. ఇప్పుడు మాత్రం దానిపై కూడా కన్నేసినట్లు తెలుస్తున్నది. మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలోని సోషల్​ మీడియా విభాగం.. బీజేపీ సోషల్​ మీడియా వింగ్​ను ఎదుర్కొవడంలో కొంత విఫలమవుతున్నట్టు గుర్తించారు. అందుకే హుజురాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా సోషల్​ మీడియాను ధీటుగా నిలబెట్టాలని పార్టీ నేతలకు కేసీఆర్​ నుంచి ఆదేశాలు అందాయని చెబుతున్నారు. కొంతమందితో టీఆర్​ఎస్​ ప్రత్యేకంగా సోషల్​ మీడియా టీంను ఏర్పాటు చేసినట్టు సమాచారం.



Next Story

Most Viewed