ఇరిగేషన్ బదిలీలపై ఆరా.. ఉన్నతాధికారి వద్దకు ఫైల్

by  |
Karimnagar Irrigation Department
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇరిగేషన్‌ శాఖలోని మూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. చిన్న, మధ్య, భారీ నీటి పారుదల శాఖలను ఒకే చోటకు చేర్చాలని ప్రభుత్వం ఈ మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టింది. అయితే బదిలీల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ‘దిశ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో బదిలీల ప్రక్రియకు సంబంధించిన ఫైల్‌ను ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారి తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారని సమాచారం. నిబంధనలను పక్కనపెట్టి మరీ అలాట్‌మెంట్ చేస్తున్న తీరు గురించి విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో ఇలాంటి తప్పిదాలు జరిగాయి, అధికారులు ఎలా చేశారు? అన్న వివరాలపై ఇరిగేషన్ బాస్ దృష్టి సారించారని సమాచారం. ఇరిగేషన్‌ శాఖలో బదిలీలు చేయిస్తామని చెప్పి కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నారని నీటిపారుదల శాఖ ఓఎస్డీ దేశ్‌పాండే ఓ ప్రకటనలో తెలిపారు. వారు చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. త్రీమెన్ కమిటీ నిర్దేశాలకు అనుగుణంగానే బదిలీల ప్రక్రియ సాగుతోందని ఆయన వివరించారు. పారదర్శకంగానే బదిలీలు జరుగుతున్నాయని ఇందులో ఎలాంటి పైరవీలకు తావివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.


Next Story