అధికారులు పనిచేయడం లేదు.. తీవ్ర ఆగ్రహంలో ప్రజాప్రతినిధులు

by  |
అధికారులు పనిచేయడం లేదు.. తీవ్ర ఆగ్రహంలో ప్రజాప్రతినిధులు
X

దిశ, కామారెడ్డి: ‘మా మండలానికి వస్తారు.. కానీ మాకు సమాచారం ఇవ్వరు. మేము ఎందుకు ఉన్నాం.. మాకు సమాచారం ఇస్తే సమస్యలు ఎక్కడ ఉన్నాయి.. అవి ఎలా పరిష్కారం అవుతాయో చెప్తాము కదా. మాకు సమాచారం లేకుండా వచ్చి ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఇదేనా అధికారుల తీరు’ అంటూ జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ దఫేదర్ శోభ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా అయితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారవుతున్నాయని వాటికి మరమత్తులు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు చేశారు. వెంటనే జిల్లాలో భారీ వర్షాలకు ధ్వంసమైన రహదారుల వివరాలు, వాటి మరమత్తులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.

నీటి పారుదల శాఖ అధికారులపై బీబీపేట ఎంపీపీ బాలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు నిండిపోయి తూము నుంచి నీళ్లు లీకవుతున్నాయని అధికారులకు తెలిపితే వారు వచ్చేటప్పుడు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. పిట్లం మండలంలో రహదారుల టెండర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గంగారాం తీసుకున్నారని, వాళ్ళు పని చేయలేదన్నారు. ఇలా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని పంచాయతీ రాజ్ అధికారులను ప్రశ్నించారు.

వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి..

తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి గందరగోళంగా తయారవుతుందన్నారు. రాష్ట్రమే కొనుగోలు చేస్తుందా, లేక కేంద్రం కొనుగోలు చేస్తుందా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని.. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ ఆమోదించింది.

సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దొత్రే, జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, వివిధ మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed