రిపోర్టర్లతో ఎస్సై దురుసు ప్రవర్తన.. డీఎస్పీ యాక్షన్

by  |
రిపోర్టర్లతో ఎస్సై దురుసు ప్రవర్తన.. డీఎస్పీ యాక్షన్
X

దిశ, కల్వకుర్తి: “నా పోలీస్ స్టేషన్‌కు ఎట్లొస్తవయ నీవు.. ముందు బయటికి నడువ్..” అంటూ మీడియాపై నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ రెండవ ఎస్సై భాస్కర్ దురుసుగా వ్యవహరించారు. సోమవారం యువజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కొందరు ఆందోళనకారుల నుంచి బైట్లు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా ఎస్సై భాస్కర్ అక్కడికి చేరుకొని వారిని అడ్డుకొని నా పోలీస్ స్టేషన్‌కు రావడానికి ఎవరు నువ్వు.. అంటుండగానే మరో కానిస్టేబుల్ మీడియా అని తెలియక సార్ అలా అన్నాడు.. అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోకుండా మీడియా సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంలో మీడియా ప్రతినిధులకు, ఎస్సైకి మధ్య కొంత వాదన జరిగింది. ఈ మేరకు కల్వకుర్తి మీడియా బృందం ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీఎస్పీ మూడు రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని ఎస్సైని ఆదేశించారు. మరోవైపు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ దురుసుగా వ్యవహరించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు.

Next Story