‘అన్నారం’లో మునిగిపోతున్నాం.. రక్షించండి మహాప్రభో..

by  |
‘అన్నారం’లో మునిగిపోతున్నాం.. రక్షించండి మహాప్రభో..
X

దిశ, కరీంనగర్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టుగా తయారైంది కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల తీరు. టెక్నికల్‌గా సక్సెస్ అయ్యామని సంబరపడిపోతున్న అధికారులు ముందస్తు ఆలోచన చేయకపోవడంతో ఆర్థికభారం పడటమే కాకుండా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజీ కీలకమైంది. కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి భారీ మోటార్లతో ఎత్తిపోసే నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా మొట్టమొదట చేరుకునేది ఈ ఆనకట్ట వద్దకే. 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్యారేజ్ బ్యాక్‌వాటర్ మంథని సమీపంలోని ఆరెంద, మల్లారం ప్రాంతాలకు వస్తాయి. అయితే రిజర్వాయర్‌లో నీటిని 119 మీటర్ల ఎత్తుకు నిలువ ఉంచాలని నిర్ణయించిన అధికారులు జయశంకర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 1200 ఎకరాల భూమిని కూడా సేకరించారు. కానీ కేసీఆర్ వద్ద శభాష్ అనిపించుకోవాలని అధికారులు ఇచ్చిన తప్పుడు ప్రతిపాదనలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసేందుకు కారణం అయింది.

అన్నారం బ్యారేజ్ బ్యాక్‌వాటర్‌తో పాటు మానేరు నది వరద నీరు కూడా ఆరెంద, మల్లారం గ్రామాల వద్ద కలవడంతో 500ఎకరాల రైతుల పంట మునిగిపోతున్నది. పెద్ద మొత్తంలో భూమిని సేకరిస్తే ప్రభుత్వంపై భారం పడుతోందని, రెండు గ్రామాల వారు ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తే ఇళ్ల విలువతో పాటు మరింత ఆర్థిక భారం పడుతుందని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే తప్పులో కాలేసి మొదట మల్లారం, ఆరెంద గ్రామాల్లోకి వరద నీరు వస్తున్న ప్రాంతాలను గుర్తించి ఆరెంద చెరువు మత్తడి నీరును డైవర్ట్ చేసేందుకు 15 ఫీట్ల లోతుతో 2కిలోమీటర్ల వరకు కెనాల్ తవ్వి మత్తడి నీరు గోదావరిలో కలిసేలా ఏర్పాటు చేశారు. మరోవైపు సోమన్‌పల్లి మీదుగా వచ్చే వరద నీటిని స్వర్ణపల్లి వద్ద నిలిపివేసి మానేరు నదిలో కలిపేందుకు కిలోమీటర్ మేర కాలువ తవ్వి సమస్య తీరిపోయిందనుకున్నారు.

కానీ మల్లారం, వెంకటాపూర్ గ్రామాల్లోని ఐదు చెరువుల్లోకి వచ్చే వరద నీటిని మళ్లించక పోవడమే కాకుండా పొలాల నుంచి వచ్చే ఫ్లడ్‌తో పాటు ఆరెంద స్వర్ణపల్లి నుంచి వచ్చే వరద చేరకుండా అన్నారం బ్యారేజ్ వాటర్‌ను నిలవరించేందుకు కరకట్టను నిర్మించారు. అయితే బ్యాక్‌వాటర్ కరకట్టను దాటి ఆరెంద, మల్లారం గ్రామాల పంట పొలాలను ముంచేస్తుండటంతో రోజుకు రూ.లక్ష ఖర్చు చేసి నీటిని అన్నారం బ్యారేజ్‌కు పంపిస్తున్నా ఫ్లో తగ్గట్లేదు. అయితే ఇది తాత్కాలికంగా వచ్చిన వరద అని చెప్పిన అధికారులు కరకట్టను కొంత తొలగించి నీటిని అన్నారానికి తరలించారు. అయితే ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌లో వచ్చిన వర్షాలకు మళ్లీ వరద నీరు వచ్చి చేరడంతో మళ్లీ అంతా మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు పంట మునిగిన వారికి ఎకరాకు రూ.21వేల చొప్పున పరిహారం చెల్లించారు. ఇప్పుడు రైతులు రెండు పంటలకు పరిహారం చెల్లించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

రెండేళ్లుగా పొలం మునిగే ఉంది: సుంకరి మహేష్
నాకున్న 4ఎకరాల భూమి రెండేళ్లుగా నీటిలో మునిగిపోవడంతో పంట సాగు చేసుకునే పరిస్థితి లేదు. భూమి వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బ్యారేజ్ బ్యాక్ వాటర్ రాకముందు రైతులమంతా కలిసి మానేరు నదిలో బోర్లు వేసుకుని రెండు పంటలు పండించుకున్నాం.

యాసంగి పంట నీటిపాలైంది: రేగటి తిరుపతి
నాకున్న ఎకరంన్నర పొలం అన్నారం నీళ్లలో మునిగింది. పొలాలను ముంచిన నీళ్లను కరకట్ట తెంపి అన్నారానికి తరలించిన అధికారులు మీ పంటలకు ఢోకా ఉండదని చెప్పారు. అయితే మళ్లీ వాన పడటంతో పైనుంచి వచ్చిన వరద నీరు యాసంగి పంటను ముంచి వేయడంతో ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది.

తప్పువాళ్లు చేస్తే మేం బలయ్యాం: పైడాకులు చంద్రయ్య
నాకున్న 5 ఎకరాల భూమి అన్నారంలో మునిగిపోయింది. మానేరు నీరు కూడా మా గ్రామాల వద్దే అన్నారంలో కలుస్తుంది. అసలు మా పొలాలే మునిగిపోవని సర్కారుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో మా ఊర్లను ముంపునకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించలేదు. ఏటా మా పొలాలన్ని నీట మునిగిపోతున్నాయి.



Next Story