మాటలతో వేధించిన వైద్యులు.. సూసైడ్ చేసుకున్న యువకుడు

by  |
మాటలతో వేధించిన వైద్యులు.. సూసైడ్ చేసుకున్న యువకుడు
X

దిశ, ఏపీ బ్యూరో: కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. తాళ్లరేవుకి చెందిన వెంకటకృష్ణ కడుపునొప్పితో కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లోని సాయిసుధా హాస్పిటల్‌లో చేరాడు. కరోనా పరీక్షలు చేసిన అనంతరం ఉదయం 9 గంటలకు ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్న వైద్యులు మధ్యాహ్నం 12 గంటలకు రోజుకి 8 వేల రూపాయలు ఖర్చవుతాయంటూ రూమ్ అలాట్ చేశారు. అనంతరం సెలైన్ బాటిల్ పెట్టి ఒక ఇంజక్షన్ ఇచ్చారు. కడుపునొప్పి పెరిగిపోతుండడంతో వెంకటకృష్ణ వైద్యులను పిలిచి నొప్పి తగ్గడం లేదని గట్టిగా అడిగాడు.

దీంతో వైద్యుడు ‘నీలాంటి వాడికి వైద్యమే ఎక్కువ… నువ్విచ్చిన డబ్బులకు ఇంతే ట్రీట్మెంట్ వస్తుంది.. చేతకానివాడివి ఎందుకు ఆస్పత్రిలో జాయినయ్యావు’ అంటూ ఒక వైద్యుడు అనరాని మాటలు అని తీవ్ర అవమానంపాలు చేశాడు. దీనిని తట్టుకోలేకపోయిన వెంకటకృష్ణ ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, కేసు తనపైకి రాకుండా ఆస్పత్రి యాజమాన్యం పోలీసులతో పాటు, హతుడి బంధువులతో రాయబారాలు, బేరసారాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story