మూడేళ్ల బుడ్డోడికి నెటిజన్ల సలాం

by  |
మూడేళ్ల బుడ్డోడికి నెటిజన్ల సలాం
X

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఎందరో వలస కూలీలు, అనాథలు, పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఎంతోమంది దాతలు సహకరించి ఆహారం అందిస్తుండగా.. మరికొంతమంది ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇంకొందరు నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఇలా ఎంతోమంది దాతలు తమకు తోచిన సాయం చేస్తున్నా ఇప్పటికీ చాలామంది పేదలు పస్తులుండాల్సిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఓ మూడేళ్ల బాలుడు తాను సైతం అంటూ విరాళం అందించేందుకు కప్ కేకులు చేస్తున్నాడు. ఈ బుడ్డోడి దాతృత్వానికి ముంబై పోలీసులు ఫిదా కాగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ముంబైలో ఉండే కబీర్ అనే మూడేళ్ల బుడ్డోడు స్వయంగా కప్ కేకులు తయారు చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులను విరాళంగా ఇద్దామని నిశ్చయించుకున్నాడు. ఇందుకు రూ.10 వేలు టార్గెట్‌‌గా పెట్టుకున్నాడు. ఆ చిన్నోడి అమ్మనాన్నలు కరిష్మా, కేశవ్‌లతో కలిసి ముంబై పోలీసులకు 50 వేల చెక్ అందించాడు. అంతేకాదు ముంబై పోలీసులకు తన చేత్తో చేసిన కప్ కేక్స్‌ను కూడా ప్రేమతో ఇచ్చాడు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కబీర్ కప్ కేకుల వీడియోకు జతగా ‘ఈ మూడేళ్ల బాలుడు చాలా స్వీట్. రాబోయే రోజుల్లో ఇతడు తప్పకుండా ఎంట్రప్రెన్యూర్ అవుతాడు.. అంతేకాదు ఫిలాంత్రపిస్ట్ కూడా అవుతాడని’ ముంబై పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed