క్షీణించిన జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఆదాయం

by  |
క్షీణించిన జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో డొమినోస్ పిజ్జా (Domino’s Pizza) ను నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ (Jubilant Foodworks) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 73.89 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 71.64 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 59 శాతం తగ్గి రూ. 3,884 కోట్లకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తితో రెస్టారెంట్ల సాధారణ కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఆదాయం ప్రతికూలంగా ప్రభావితమైనట్టు, దీంతో ఆర్థిక ఫలితాల్లో అమ్మకాలు, లాభాలు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనా నష్టాలను అధిగమించేందుకు అద్దె రాయితీలతో పాటు ఇతర ఖర్చులు రూ.29.65 కోట్లు తగ్గినట్టు కంపెనీ తెలిపింది.

‘కరోనా సంక్షోభం నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు జీరో కాంటాక్ట్ డెలివరీని ప్రారంభించాం. అలాగే వ్యయాన్ని తగ్గిస్తూ, నిర్మాణాత్మక మార్పులను చేసుకునేందుకు కరోనా కాలాన్ని ఉపయోగించాము. ఖర్చులను తగ్గించుకునేందుకు లాభరహిత స్టోర్లను తొలగించి, వాటి స్థానంలో చెఫ్‌బాస్ (chef boss) లాంటి ఎఫ్ఎంసీజీ (FMCG) విభాగంలోకి ప్రవేశించినట్టు’ జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ సీఈవో, డైరెక్టర్ ప్రతీక్ వెల్లడించారు.

Next Story

Most Viewed