కొత్త సారధి వచ్చినా కనిపించని జోష్

by  |
TDP
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ పాదయాత్రలు, నిరసనలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. కానీ టీడీపీ మాత్రం ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం లేదు. పార్టీకి కొత్తసారధి వచ్చినా ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం, పార్టీ కార్యాలయంలో సమావేశాలకే పరిమితం కావడంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. జోష్ నింపేవారు లేకపోవడంతో పార్టీ క్యాడర్ సందిగ్ధంలో పడింది. పార్టీకి పూర్వవైభవం వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురవుతుంది. పార్టీలోని నేతలు తమ పదవులు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రారంభించాడు. పార్టీని పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 42 లోక్ సభ స్థానాలకు గాను 35 స్థానాలను గెల్చుకొని సత్తాచాటారు. 1983, 1984(మధ్యంతర ఎన్నికల్లో) 294 అసెంబ్లీ స్థానాలకు గాను 202 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1994 నుంచి 2004 వరకు 9 ఏళ్లు చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అంతటి చరిత్ర ఉన్న టీడీపీకి.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 నుంచి సారధి కొరత ఏర్పడింది. అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణ ను నియమించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నాయకులంతా ఇతర పార్టీల్లో చేరడం, వారిని నియంత్రించేవారు గానీ, వారిలో భరోసా కల్పించే వారుగానీ లేకపోవడంతో పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. గ్రామ స్థాయిలో నేటికీ క్యాడర్ ఉన్నప్పటికీ నాయకుల కొరత ఏర్పడింది. నడిపించేవారు లేకపోవడంతో కొంత క్యాడర్ వివిధ పార్టీల్లో చేరారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడేవారే టీడీపీలో కరువయ్యారు. దీనికి తోడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో నేతలు విఫలమవుతున్నారని ఆ పార్టీ నేతలే పేర్కొంటుండటం గమనార్హం. పార్టీకి అనుబంధ సంఘాలు యువజన, విద్యార్థి, మహిళా, రైతు, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయని పేర్కొంటున్నప్పటికీ ప్రజాసమస్యలపై గళమెత్తేవారే కరువయ్యారు. కేవలం పదవులకోసం పాకులాడుతున్నారే తప్ప పార్టీ బలోపేతంపై దృష్టిసారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అమావాస్య, పున్నమి అన్నట్లు వారికి గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే సమావేశం నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అధ్యక్ష పదవికి రమణ రాజీనామా చేసిన తర్వాత జూలై 19న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికే పరిమితం అయ్యారు తప్ప ఏ జిల్లాకు వెళ్లి పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. కేవలం రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. సమావేశాలతో కాలయాపన చేయడంతో పార్టీ క్యాడర్ ను నష్టపోయే అవకాశం ఉందనే భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీకి గ్రామస్థాయిలో క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వం లోపించింది. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినా ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ రూపొందించకపోవడంతో క్యాడర్ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం, మండల, జిల్లా స్థాయిల్లో సమావేశాలు, సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించకపోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యానికి గురవుతున్నారు. ఇప్పటికైన పార్టీ అధిష్టానం కార్యచరణ రూపొందించి ముందుకు సాగితే తప్పా పార్టీ మనుగడ అసాధ్యమే. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేక పదవులుంటే చాలు పార్టీ ఏమైపోతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed