జపాన్‌లో మే 31 వరకు లాక్‌డౌన్

by  |
జపాన్‌లో మే 31 వరకు లాక్‌డౌన్
X

కరోనా కట్టడి చర్యలను కఠినంగా అమలు చేస్తోన్న జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని షింజో అబే ప్రకటించారు. దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ను త్వరగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 7న తొలి సారి లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ నెల 7తో లాక్‌డౌన్ గడువు ముగుస్తుండగా.. దేశంలో మాత్రం కోవిడ్-19 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో లాక్‌డౌన్ పొడగింపు, కరోనా నివారణ చర్యలపై జపాన్ ప్రధాని షింజో అబే కీలక సమీక్ష నిర్వహించారు. పలు రంగాలకు చెందిన నిపుణుల బృందంతో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని అబే తన నిర్ణయం ప్రకటించారు. మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని నిపుణుల బృందం కూడా సూచించడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. ఈ కీలక సమయంలో లాక్‌డౌన్ ఎత్తేస్తే మళ్లీ కరోనా ఉధృతం కావొచ్చని నిపుణులు వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు పొడిగిస్తే.. కరోనాను దేశంలో పూర్తిగా నివారించడానికి ఆ సమయం సరిపోతుందని సమీక్షలో పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో భౌతిక దూరం నిబంధనతో పాటు ఇతర మార్గదర్శకాలకు సడలింపులు ఇస్తే కరోనా వ్యాప్తి పెరిగిపోతుందని.. యూరోప్, అమెరికాలా జపాన్ మారే అవకాశం ఉందని నిపుణులు చెప్పడంతో ఎలాంటి సడలింపులు ప్రకటించలేదు. గతంతో ప్రకటించిన మార్గదర్శకాలే అమలులో ఉంటాయని.. ప్రజలందరూ తప్పకుండా భౌతిక దూరం పాటించాల్సిందేనని ప్రధాని అబే స్పష్టం చేశారు.

Tags: Coronavirus, Covid 19, Japan, Shinzo Abe, Lockdown, Extended

Next Story

Most Viewed