రాజకీయాలను తిరగరాసిన యాన్ మిర్దాల్..

by  |
రాజకీయాలను తిరగరాసిన యాన్ మిర్దాల్..
X

దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో ఎందరో ప్రభావశీలురు ఉన్నారు. కొందరు వారి మాటలతో ప్రభావితం చేస్తే, మరికొందరు వారి చేతలతో ప్రభావితం చేస్తూ ప్రపంచాన్ని ముందుండి నడిపించారు. కానీ రాతలతో ప్రభావితం చేసిన వారి సంఖ్య తక్కువే. అంటే క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని, ఆ తర్వాత వారి అనుభవాలను పుస్తకాలుగా రాసిన వారు ఉన్నారు. కానీ కేవలం రాతలు, అభిప్రాయాల ద్వారా రాజకీయాలను ప్రభావితం చేసిన వారు అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన రచయితలు, రాజకీయవేత్తల్లో యాన్ మిర్దాల్ ఒకరు. ఆంగ్లంలో ఈయన పేరును రాస్తే ‘జె’ అక్షరం వాడాల్సి ఉంటుంది. స్వీడన్ భాషలో ‘జె’ అక్షరాన్ని ‘య’ అక్షరంగా పలుకుతారు. పేరులో ప్రత్యేకతతో పాటు రాయడంలోనూ గొప్ప ప్రతిభ గల రచయిత.. యాన్ మిర్దాల్. ఇంత ప్రతిభ గల ఈ స్వీడిష్ రచయిత, అక్టోబర్ 30, 2020న పరమపదించారు. దేశాల రాజకీయాలను తన రాతలతో కడిగి పారేసి, ఎంతో మందిని ప్రభావితం చేసిన ఆయన గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తన అభిప్రాయాలను వెలిబుచ్చడానికి సొంత తల్లిదండ్రుల గురించి పచ్చినిజాలను బయటపెట్టి స్వీడన్ రాజకీయాలను తారుమారు చేసిన ఘనుడు మిర్దాల్.

నోబెల్ గ్రహీతలైన ఆల్వా మిర్దాల్, గున్నార్ మిర్దాల్‌లకు 1927లో యాన్ మిర్దాల్ జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తన తల్లిదండ్రులతో పాటు ఆయన అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. చిన్నవయస్సులో న్యూయార్క్ నగరంలో ఆయనకు ఎదురైన అనుభవాలే తన తెలివితేటలకు కారణమని మిర్దాల్ తాను రాసిన చాలా పుస్తకాల్లో పేర్కొన్నారు. యుక్తవయస్సులో స్కూల్ వదిలిపెట్టి రచనలు, రాజకీయాల బాటపట్టాడు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలు తిరిగాడు. అక్కడి రాజకీయ పరిస్థితులు, సమాజం గురించి ఆయా దేశాల్లో తనకు ఎదురైన అనుభవాల గురించి రాశారు. ఈ పుస్తకాల వల్ల ఆయన ప్రాచ్య రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా ప్రాచ్య దేశాల మీద పాశ్చాత్య దేశాల ప్రభావం, పెరుగుతున్న కమ్యూనిజం, మూడో ప్రపంచ దేశాల శాంతిస్థాపన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. ఈ ప్రస్తావనల కారణంగా ఒకానొక తరుణంలో ప్రాచ్య దేశాలన్నీ మిర్దాల్ రాసిన పుస్తకాలను నిషేధించాయి.

ఇలా స్టాలినిస్ట్, మావోయిస్ట్ భావజాలం కలయికతో మిర్దాల్ అలవరుచుకున్న రాడికల్ కమ్యూనిజం వల్ల రాజకీయ సమస్యలతో పాటు మిర్దాల్ కుటుంబంలో వ్యక్తిగత సమస్యలు కూడా తలెత్తాయి. స్వీడన్‌ అధికార పార్టీ అయిన సోషల్ డెమోక్రాట్ పార్టీలో ప్రముఖ స్థానాల్లో ఉన్న తన తల్లిదండ్రులు ఆల్వా, గున్నార్‌లతో యాన్ మిర్దాల్ బంధాలు తెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు సామాజిక-ప్రజాస్వామ్య స్వీడన్‌లో ఒక ఆదర్శ కుటుంబంగా ఉన్న మిర్దాల్ కుటుంబం, యాన్ భావజాలం, ఆలోచనల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన తర్వాత యాన్ మిర్దాల్ తాను రాసిన పుస్తకాల్లో తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావించేవారు. తల్లిదండ్రుల గురించి పచ్చినిజాలు బయటపెడుతూ వారిని కించపరుస్తూ రాసేవారు. అయితే ఏనాడూ కూడా ఆయన పుస్తకాలలో తన తల్లిదండ్రుల తెలివితేటలను ఆయన కించపరచలేదు.

ఆ కాలంలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక, సామాజిక అంశాలను, రాజకీయాలకు అనుసంధానిస్తూ యాన్ మిర్దాల్ రచనలు చేశారు. ఆయన పుస్తకాల్లో 19వ శతాబ్దపు ఫ్రెంచ్ కేరికేచర్, ఆఫ్ఘనిస్తాన్, బాల్జాక్ యుద్ధరీతులు, భారతీయ నక్సలిజం, వైన్, సెక్స్, కార్టెల్స్ ఇలా అన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను మిర్దాల్ రచనలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. స్థానిక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేసి, స్వతహాగా రచయితగా మారిన మిర్దాల్‌కు మొదట్లో తన రచనలను ముద్రించే పబ్లిషర్స్ దొరకలేదు. ఆయనకు బాగా పేరు సంపాదించి పెట్టిన ‘రిపోర్ట్ ఫ్రమ్ ఎ చైనీస్ విలేజ్ (1963)’ రచన, ఆయన రాసిన మొదటి పుస్తకం కాదు. దానికి ముందు కూడా రాశారు. కానీ అవి ప్రచురణకు నోచుకోలేదు. తన భార్య గున్ కెస్లేతో కలిసి ఆసియా, మధ్య సోవియట్ దేశాల్లో పర్యటించి, ఆ పర్యటనలో తాను రాసుకున్న నోట్స్‌ను ఆయన పుస్తకాలుగా మలిచారు. వీటితో పాటుగా ఆయన ఆత్మకథ పుస్తకాలు ‘ఐ నావల్స్’లో తన వ్యక్తిగత సంబంధాలు, చిన్ననాటి విశేషాల గురించి ప్రస్తావించారు. ఇవి మాత్రమే కాకుండా ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ డిస్‌లాయల్ యురోపియన్ (1968)’, ‘ఆంగ్‌కోర్ : యాన్ ఎస్సే ఆన్ ఆర్ట్ అండ్ ఇంపీరియలిజం (1970)’, ‘ఆల్బేనియా డెఫియంట్ (1970)’, ‘ద సిల్క్ రోడ్ (1977)’, ‘కార్పెట్స్ ఫ్రమ్ చైనా, జిన్‌జియాంగ్, టిబెట్ (1979)’, ఇండియా వెయిట్స్ (1980)’, ‘రిటర్న్ టు ఎ చైనీస్ విలేజ్ (1984)’, ‘చైల్డ్‌హుడ్ (1991)’, ‘ట్వెల్వ్ గోయింగ్ ఆన్ థర్టీన్ (2010)’, ‘రెడ్ స్టార్ ఓవర్ ఇండియా (2012)’ వంటి రచనలు ఆయనకు ఓ వైపు వివాదాస్పద రచయితగా, మరో వైపు దూరదృష్టి గల రాజకీయవేత్తగా పేరు తీసుకొచ్చాయి.

పైన ప్రస్తావించిన పుస్తకాల్లో ఇండియా పేరుతో రెండు ఉండటం గమనించి యాన్ మిర్దాల్‌కు, ఇండియాకు సంబంధమేంటని ఆశ్చర్యపోకండి. ఆయన భావజాలాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఆ సంబంధం గురించి తెలుసు. ఇండియా వెయిట్స్ పుస్తకంలో మార్క్సిజాన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామీణ భారతం నుంచి ఒక విప్లవం ఉద్భవించడానికి ఎదురుచూస్తోందని యాన్ మిర్దాల్ అభిప్రాయపడ్డారు. ఇది అచ్చుగుద్దినట్లు చైనాలో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవాన్ని పోలి ఉంటుందని అప్పట్లో ఆయన అన్న మాటలు పెద్ద వివాదాన్ని తీసుకొచ్చాయి. ఇక ‘రెడ్ స్టార్ ఓవర్ ఇండియా’ రాయడానికి ముందు ఆయన భారతదేశానికి వచ్చి కీకారణ్యంలా కనిపించే బస్తర్ అడవుల్లో, సీపీఐ మావోయిస్టు నేత లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో వ్యక్తిగతంగా సంభాషించారు. ఆ అడవుల్లో నివసించే ఆదిమ జాతి ప్రజలు, అక్కడి పరిస్థితులు, పరిపాలన గురించి లోతుగా అధ్యయనం చేశారు. అప్పుడు ఆయన వయస్సు 83 సంవత్సరాలు. 55 ఏళ్ల వయస్సు రాగానే పెన్షన్ కోసం పరితపిస్తున్న ఈనాటి తరంతో పోలిస్తే, 83 ఏళ్ల వయస్సులో తన భావజాలాన్ని రాతల ద్వారా తెలియజేయడానికి అడవుల్లో అధ్యయనాలు చేసిన యాన్ మిర్దాల్ నిజంగా గొప్ప వ్యక్తి!

Next Story

Most Viewed