హైకోర్టు ఆదేశాలతో సినిమా టికెట్ల ధరలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

by  |
హైకోర్టు ఆదేశాలతో సినిమా టికెట్ల ధరలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టికెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చేటట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు థియేటర్ల యాజమాన్యం.. ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ కావాలని థియేటర్ల యాజమాన్యం.. ఎగ్జిబిటర్లు నిర్ణయించుకుని మంత్రి అపాయింట్మెంట్ కోరారు. దీంతో మంగళవారం వీరితో మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల వివాదానికి సంబంధించి ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అయితే రెవెన్యూ, ఆర్థిక, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, న్యాయ శాఖ సెక్రటరీలు సభ్యులుగా ఉండనున్నారు.

రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల ధరల వివాదంపై ఈ కమిటీ పరిశీలన చేసి త్వరలోనే ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది. ఇకపోతే ఇటీవలే రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు డివిజన్ బెంచ్ టికెట్ ధరలను నిర్ణయించే అధికారాలను జేసీకి అప్పగించింది. అలాగే ప్రభుత్వాన్ని ఓ కమిటీ వేసి అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని నియమించింది.



Next Story

Most Viewed