అటు కాంగ్రెస్.. ఇటు టీఆర్ఎస్.. ఒక్కటవుతున్నాయి

by  |
అటు కాంగ్రెస్.. ఇటు టీఆర్ఎస్.. ఒక్కటవుతున్నాయి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా ప్రత్యర్థులు. కానీ ఈ రెండూ ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకదానిపై ఒకటి నిప్పులు చెరిగాయి. కానీ రైతుల విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలూ ఒకే వైఖరి తీసుకున్నాయి. రైతుసంఘాలు ఇచ్చిన ‘డిసెంబరు 8 భారత్ బంద్’ పిలుపుకు రెండూ సానుకూలంగా స్పందించాయి. బంద్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. నిన్నమొన్నటి దాకా కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడడం కాంగ్రెస్‌కు తలనొప్పి తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పునరావృతం కావడంతో టీఆర్ఎస్‌కు గుబులు పుట్టించింది. దీంతో బీజేపీ వ్యతిరేక వైఖరి అనివార్యమైంది.

బీజేపీకి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థులు కావడంతో ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అన్న చందంగా తెలంగాణలో ఈ రెండూ ఒకే అభిప్రాయానికి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం ఈ రెండు పార్టీలకూ కలిసొచ్చింది. డిసెంబరు 8వ తేదీ రైతు సంఘాలు ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

‘భారత్ బంద్’లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొంటోంది. ‘భారత్ బంద్’కు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో జరిగే ఆందోళనల్లో ఈ రెండు పార్టీలు కలిసి పాల్గొంటాయా లేక వేర్వేరుగా ఉంటాయా అన్నది తేలాల్సి ఉంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలపడడం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆందోళన కలిగించింది. చికాకు పుట్టించింది. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలూ ఒకే ప్లాట్‌ఫాం మీదకు వచ్చి బీజేపీతో తలపడే అవకాశాలు ఉన్నాయన్న రాజకీయ ఊహాగానాలకు ఇప్పుడు రైతుల సంఘాలు ఇచ్చిన ‘భారత్ బంద్’ ఒక రకంగా ఈ రెండింటినీ దగ్గర చేయడానికి దోహదం చేసింది.



Next Story

Most Viewed