ఈటల మౌనం వెనుక కారణం ఇదేనా..?

by  |
Etala Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల రాజేందర్​మౌనం వెనక ఏం జరిగిందనేది ఇప్పుడు మరో చర్చ మొదలైంది. శనివారం రాత్రి వరకు నానా హడావుడి సృష్టించిన ఈటల వ్యవహారం ఒక్కసారిగా సైలెంట్​అయింది. మీడియాతో, పార్టీ నేతలతో సమావేశాలు, చర్చల్లో మునిగిన మంత్రి మరుసటిరోజు నుంచే మౌనం వహించారు. ఇప్పుడు కనీసం ఫోన్‌లో కూడా చిక్కడం లేదు. దీంతో ఈటల మౌనం వెనక రహస్యం ఏమిటనే దానిపై ప్రచారం మొదలైంది.

సీనియర్ల రాజీ యత్నం

మంత్రి ఈటలతో రాజీ యత్నానికి ఇద్దరు సీనియర్లు రంగంలోకి దిగారని, ఓ ఎంపీ, మరో సీనియర్​మంత్రి ఈ బాధ్యతలను భుజానేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. సీఎం కేసీఆర్‌తో రాజీ కుదిర్చే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు ఉన్న అంశాలపై చర్చిస్తూ ఈటలపై సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అందుకే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్​చేయలేదని, కేవలం శాఖ మార్పుపైనే నిర్ణయం తీసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో అనవసరంగా తిరుగుబాటు చేయడం సరికాదని, సరైన సమయమే కాదంటూ సముదాయిస్తున్నారని సమాచారం. ఈ ఇద్దరు సీనియర్ల రాయబారంతో మంత్రి ఈటల కూడా పునరాలోచనలో పడినట్లు ఉందంటున్నారు. అందుకే ఈటల వ్యవహారంలో ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలు, నేతలను సైతం సైలెంట్​ కావాలనే సంకేతాలిచ్చారు.

కలిసి ఉందాం!

కేటీఆర్​సీఎం అనే అంశంపైనే ఈటల రాజేందర్‌పై పార్టీ బాస్​ఆగ్రహంగా ఉన్నారని పార్టీలో చర్చ సాగుతోంది. ఉద్దేశపూర్వకంగానే అధిష్టానం నుంచి కేటీఆర్‌ను సీఎం చేస్తారనే లీకులివ్వడం, దీనిపై ఈటలతో పాటు కొంతమంది వ్యతిరేకించడంతో ఈటలకు కత్తెర వేయాలనే ప్లాన్​ వేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సమయంలోనే అసైన్​ల్యాండ్​ ఆధీనంలోకి తీసుకున్నాడనే వ్యవహారాన్ని బయటకు తీశారని, అయితే ఈ నివేదిక పూర్తిగా చేతికి అందకముందే ఈటల నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను మార్చారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

ఒకవేళ నిజంగానే ఈటలపై అంత కోపంగా ఉంటే కేబినెట్ నుంచి బర్తరఫ్​చేసేవారని, గతంలో తాటికొండ రాజయ్య అంశం, తాజాగా జరిగిన పీఆర్వో విజయ్‌కుమార్​అంశాలను నెమరువేసుకుంటున్నారు. కేసీఆర్‌కు కోపం వస్తే… వెనకాముందు ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటారని, కానీ ఈటల వ్యవహారంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఈటలకు మంచి అవకాశాలే ఉన్నాయని, కేటీఆర్, ఇతర నేతలతో కలిసి ఉంటే కేబినెట్‌లో బెర్త్​కొనసాగుతుందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనిపై పునరాలోచనలు… సీనియర్​నేతల సమాలోచనలతోనే ఈటల ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని టాక్.

Next Story

Most Viewed