పోలవరంపై కేంద్రంతో సమరానికి సర్కార్ సిద్ధమా…?

by  |
పోలవరంపై కేంద్రంతో సమరానికి సర్కార్ సిద్ధమా…?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రజల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఆడుతున్న నాటకం రసకందాయంలో పడింది. ఆరేళ్ల నాటి అంచనా వ్యయం ప్రకారమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనా వ్యయం పెరిగిన దాన్నిబట్టి ఇవ్వాలనిరాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. దీనిపై కేంద్రం దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల దృష్టిలో దోషిగా నిలవాల్సి వస్తుంది. నిర్వాసితుల పునరావాసంతో మాకు పని లేదని కేంద్రం చెబుతోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మహాపాపాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రెండే దారులున్నాయి. కేంద్రంతో తలపడడమా లేక పలాయనవాదమా అనేది జగన్ సర్కారు తేల్చుకోవాలి.

పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనా 2014లో రూ.20, 398.61 కోట్లుగా నిర్ణయించారు. అప్పటికి 2013 భూసేకరణ చట్టం అమల్లోకి రాలేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక ఒకటికి రెండు రెట్లు భూసేకరణకు పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో వ్యయ అంచనా రూ. 55 వేల కోట్లకు పైగా పెరిగింది. 2019 ఫిబ్రవరిలో దీన్ని రూ.47,725 కోట్లకు కుదించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ వ్యయాన్ని తగ్గిస్తూ గత ఏడాది జూలైలో ఈ అంచనాను ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రివర్స్అవుతోంది. కేంద్రం మోసకారితనాన్ని జగన్ ప్రభుత్వం ఎదిరించడమా లేక విపక్షంపై నిందలేసి తప్పించుకోవడమా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో నర్మదా డ్యాం కన్నా ఎక్కువ సంఖ్యలో నిర్వాసితులవుతుంది పోలవరం కిందే. వైసీపీకి 90 శాతం ఓట్లేసిన ఆ నియోజకవర్గాలను మోసం చేస్తారా ! ఏడు గిరిజన నియోజకవర్గాలు జగన్మోహన్రెడ్డిపై విశ్వాసం వ్యక్తం చేశాయి. అలాంటి అమాయక గిరిజనులను ఏం చేయదల్చుకున్నారనేది సీఎం జగన్ తీసుకునే వైఖరిని బట్టి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ టెంపరితనంపై వివిధ రాజకీయ పక్షాల స్పందన ఎలా ఉందంటే..

స్వయంకృతాపరాధం -టీడీపీ అధినేత చంద్రబాబు

మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రూ. 55 వేల కోట్లకు అంచనా వేసి పంపితే మమ్మల్ని తూర్పారబట్టారు. కమీషన్ల కోసం అంచనాలు పెంచారని విమర్శించారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పరిపాలన చేతగానితనం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రివర్స్టెండరింగ్పేరుతో తన అనునూయలకు కట్టబెట్టారు. పర్సంటేజీలపై ఉన్న ధ్యాస ప్రాజెక్టుపై ఉంటే బావుండేది.

బీజేపీ ద్వంద్వ వైఖరి

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఆడుతున్న డ్రామాకు అనుగుణంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పారు. మరి ఎందుకు చర్యలు తీసుకోరో చెప్పరు. ఇక్కడేమో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైసీపీ విఫలమని ఓ నేతంటారు. బాగానే చేస్తున్నారని మరో నేత చెబుతారు. ఇది అన్యాయమని కేంద్రం దగ్గరకెళ్లి చెప్పలేని వెనుకబాటుతనంతో ఆ పార్టీ ఉంది.

కేంద్ర దురాగతంపై అఖిల పక్షం వేయాలి -కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. నిర్వాసితుల పొట్టగొట్టే నిర్ణయాలు చేస్తోంది. తనకు రాజకీయ ప్రయోజనం లేని ఏ పని బీజేపీ చేయదు. అందుకే పోలవరానికి కొర్రీలు వేస్తోంది. రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. సీఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికైనా స్పందించి అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి. అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
ముందు నిర్వాసితుల సంగతి చూడండి
-పి.అరుణ్, సీపీఎం నేత, రాజమండ్రి

రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే పునరావాసంపై దృష్టి సారించాలి. అప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలి. కేంద్ర దుష్టపన్నాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తుంటే ముందుగా నిర్వాసితుల బాగోగులు చూశాకనే నిర్మాణం మొదలు పెట్టాలి. దీనికి భిన్నంగా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తవుతున్నా నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదు. ఇది అమానవీయం. దారుణం.


Next Story

Most Viewed