కాళేశ్వరం పనులు సాగితేనే సాగునీరు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

by  |
కాళేశ్వరం పనులు సాగితేనే సాగునీరు: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు 22 ప్యాకేజి కాళేశ్వరం పనులు సాగితేనే నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శాసనసభలో ప్రస్తావించారు. శుక్రవారం జీరో అవర్ లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం 22 ప్యాకేజి పనుల్లో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగు నీరందించేది 22 ప్యాకేజి పనులన్నారు. ఇప్పటివరకు కొంత పనులు చేసి మధ్యలో ఆపేయడం జరిగిందన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో కేవలం బోరు బావులపై ఆధారపడి బ్రతికే పరిస్థితి ఉందని తెలిపారు. భగవంతుని దయతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండాయని, 26 సంవత్సరాల తర్వాత బిబిపేట, జంగంపల్లి చెరువులు అలుగులు పారాయని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 7 మండలాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయని, కేవలం 22 ప్యాకేజి కాళేశ్వరం పనులు జరిగితేనే తమకు నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు.

అంతటా కాళేశ్వరం నీరు కాల్వల ద్వారా వచ్చి పంటలు పండుతుంటే తాము ఆనందం వ్యక్తం చేస్తున్నామని, తాము కూడా కాళేశ్వరం నీటి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తొందరగా భూసేకరణ చేపట్టి 22 ప్యాకేజి పనులు పూర్తి చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరందించాలని కోరారు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు నియోజకవర్గాలలోని సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం అదే పథకానికి కాళేశ్వరం పేరుతో పనులు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూసేకరణ జరగక పోవడంతో పనులు మందకోడిగా సాగుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి షబ్బీర్ అలీ కాళేశ్వరం 22 ప్యాకేజి పనులకు ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేస్తే ఇక్కడి సాగు భూములు సస్యశ్యామలం అవుతాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్యాకేజి 22 పనుల కోసం త్వరలోనే కామారెడ్డి నుంచి భూంపల్లి వరకు పాదయాత్ర చేపడతామని, ఈ పాదయాత్రకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారని ఇటీవల బిక్కనూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ లోపే అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడంతో ఇక్కడి ప్రాంత రైతుల సమస్యను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రస్తావించారు. అయితే ప్యాకేజి పనులు చేపడతారా.. చేపడితే ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే సమాధానం మాత్రం ప్రభుత్వం నుంచి రాలేకపోయింది.



Next Story

Most Viewed