బీమా ప్రీమియం చెల్లించకపోతే క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు: సుప్రీంకోర్టు!

by  |
బీమా ప్రీమియం చెల్లించకపోతే క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు: సుప్రీంకోర్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: బీమా పాలసీకి సంబంధించి ప్రీమియం సరైన సమయంలో చెల్లించకపోతే క్లెయిమ్‌లను తిరస్కరించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీమా పాలసీ నిబంధనలను స్పష్టంగా అర్థం చేసుకోవాలని వినియోగదారులకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి చనిపోయిన వ్యక్తి బీమా కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ) సదరు వ్యక్తికి బీమా చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తున్నట్టు సుప్రీం తీర్పు ఇచ్చింది.

బీమా తీసుకున్న సమయంలో వినియోగదారుడితో సంస్థ చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమైనదని కోర్టు పేర్కొంది. మొదట చేసుకున్న ఒప్పందంలో మార్పులు చేయడం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఎల్ఐసీ ద్వారా ఓ వ్యక్తి రూ. 3.75 లక్షల విలువైన పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీ ప్రకారం వ్యక్తి మరణిస్తే అదనంగా మరో రూ. 3.75 లక్షలను బీమా సంస్థ ఇస్తుంది. ఈ పాలసీకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించాలి. 2012లో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

ఆ తర్వాత 15 రోజులకు అతను మరణించాడు. బీమా ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ. 3.75 లక్షలను ఎల్ఐసీ ఇచ్చేసింది. ప్రమాదం జరిగితే అదనంగా వచ్చే రూ. 3.75 లక్షలను మాత్రం తిరస్కరించింది. ఎందుకంటే అతని పాలసీ 2011, అక్టోబర్‌లోనే ముగిసింది. తర్వాత పునరుద్ధరించలేదు. ఈ అంశంలో చనిపోయిన వ్యక్తి భార్య జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

అనంతరం ఎల్ఐసీ రాష్ట్ర స్థాయి పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఎల్ఐసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రమాదం జరిగే నాటికి పాలసీ ముగిసిందని, కాబట్టి బీమా సంస్థ అదనపు పాలసీ మొత్తాన్ని తిరస్కరించడం సబబే అని తీర్పు ఇచ్చింది.


Next Story

Most Viewed