భారత్‌లోనే అతిపెద్ద వాహన రీకాల్ ప్రకటించిన రాయల్ ఎన్‌ఫీల్డ్!

by  |
Royal Enfield
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ మిడ్-రేంజ్ మోటార్‌సైకిల్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ అతిపెద్ద రీకాల్‌ను ప్రకటించింది. కంపెనీ మోడళ్లు క్లాసిక్, బుల్లెట్, మీటియర్‌ల ఇగ్నిషన్ కాయిల్‌లో టెక్నికల్ లోపాన్ని గుర్తించామని, దీనికోసం 2.36 లక్షల యూనిట్లను రీకాల్(వెనక్కి రప్పించడం) చేస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. వీటిలో విదేశాలకు ఎగుమతి చేసిన యూనిట్లు కూడా ఉన్నాయని కంపెనీ వివరించింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఇండోనేషియా, థాయ్‌లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలకు ఎగుమతి చేసిన మొత్తం 2,36,966 బైకులను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇగ్నిషన్ కాయిల్‌లో లోపం వల్ల బైక్ పనితీరు మందగిస్తుందని, కొన్ని సందర్భాల్లో(అరుదుగా) షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. సాంకేతిక లోపం ఉన్న బైకుల కోసం కంపెనీ డీలర్‌షిప్ ప్రతినిధులే సంప్రదిస్తారని స్పష్టం చేసింది.



Next Story

Most Viewed