ఒత్తిడే చిత్తు చేసిందా..!

by  |
ఒత్తిడే చిత్తు చేసిందా..!
X

మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి ఒత్తిడే కారణమని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. అండర్ డాగ్స్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆసీస్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. తర్వాత వరుస విజయాలు దక్కించుకుంది. కానీ ఫైనల్లో అదే ఆస్ట్రేలియా జట్టుపై ఘోర పరాజయం పాలైంది. మెగా టోర్నీల్లో ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు తక్కువగా ఉండటంతో జట్టుపై ప్రభావం చూపిందనేది విశ్లేషకుల మాట.

కీలకమైన క్యాచ్‌లు వదిలేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యారు. ఒక పరుగు రావాల్సిన చోట రెండు పరుగులు ఇవ్వడం.. బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపలేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు అనుకున్నదానికన్నా ఎక్కువ పరుగులే చేసింది. మరోవైప్ టోర్నీ అంతా రాణించిన ఓపెనర్లు ఫైనల్స్‌లో మాత్రం చేతులెత్తేశారు. వాళ్లు అవుటైన తీరు కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ దశలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా సులువుగా వికెట్‌ పారేసుకోవడం జట్టును తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. మరోవైపు ఆసీస్ బౌలర్లు ఏ సమయంలో కూడా ఇండియన్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత జట్టు తమ కల తీరకుండానే ఆస్ట్రేలియా నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

మెగన్ షట్ మైండ్ గేమ్..!

మైండ్ గేమ్ ఆడటంలో ఆసీస్ పురుష క్రికెటర్లకు తామేమీ తీసిపోమని మహిళా క్రికెటర్లు కూడా నిరూపించారు. ముఖ్యంగా గ్రూప్ దశలోని తొలి మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లను భారత టాపార్డర్ చితకబాదడంతో ఈ మైండ్ గేమ్‌కు తెరలేపారు. ఆసీస్ పేసర్ మెగన్ షట్ రెండు రోజుల కిందట భారత స్టార్ బ్యాట్స్‌వుమెన్ షఫాలీ, మరో ఓపెనర్ స్మృతి మంధాన గురించి వ్యాఖ్యలు చేసింది. ‘అమ్మో వాళ్లకు నేను బౌలింగ్ చేయలేను.. వాళ్లు నన్ను ఉతికేస్తారు.. అందుకే ఇండియాతో ఆడటమంటే నాకు ఇష్టం ఉండదు’ అని వ్యాఖ్యానించింది. ఫైనల్లో నేను తొలి ఓవర్లు వేయలేను అని కూడా అన్నది.

ఇక్కడే భారత బ్యాటర్లు మెగన్ షట్‌ను తక్కువగా అంచనా వేశారు. ఆమె ఉచ్చులో పడిన షఫాలి మూడో బంతికే వికెట్ పారేసుకోవడం చూస్తుంటే.. ఆమె మైండ్ గేమ్ ఎలా పని చేసిందో అర్థం చేసుకోవచ్చు.

tags: ICC, Women WT20, Ind Vs Aus, MCG, Australia Won,

Next Story

Most Viewed