క్రీడాకారులను వెంటాడుతున్న కరోనా

by  |
క్రీడాకారులను వెంటాడుతున్న కరోనా
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 10 నెలల అంతరాయం తర్వాత అంతర్జాతీయ వేదికల్లో క్రీడలు ప్రారంభమయ్యాయి. దీంతో క్రీడాకారులు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయక తప్పట్లేదు. ఈ క్రమంలో పలువురు క్రీడాకారులు కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. భారత మహిళా క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కరోనా బారిన పడింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన హర్మన్.. చివరి మ్యాచ్‌లో గాయపడటంతో టీ20 సిరీస్‌కు దూరమైంది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన ఆమె పరీక్షలు చేసుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కరోనా బారిన పడినట్లు తెలిపాడు. రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న అనంతరం ఇంటికి చేరుకున్న ఇర్ఫాన్.. సోమవారం పరీక్షలు చేసుకోగా కరోనా బారిన పడినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఆ సిరీస్ ఆడిన బద్రినాథ్, సచిన్ టెండుల్కర్, యూసుఫ్ పఠాన్‌లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

మరోవైపు బాస్ఫొరస్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వెళ్లిన ఎనిమిది మంది భారతీయ బాక్సర్లకు కరోనా సోకినట్లు తెలుస్తున్నది. ఈ నెల 19నే బాక్సింగ్ టోర్నమెంట్ ముగిసినా వాళ్లు టర్కీ నుంచి తిరిగి రాలేదు. వీరిందరినీ ఐసోలేషన్‌లో ఉంచినందు వల్లే టోర్నీ ముగిసిన వెంటనే తిరిగి రాలేదని తెలుస్తున్నది. ప్రొఫెషనల్ బాక్సర్స్ అయిన గౌరవ్ సోలంకి, ప్రయాగ్ చౌహాన్, బ్రిజేష్ యాదవ్‌లకు వారం క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు కోచ్‌లు ధర్మేంద్ర యాదవ్, సంతోష్ బర్మోల్, ఫిజియోథెరపిస్ట్‌లు షిఖా కెడియా, డాక్టర్ ఉమేష్‌తో పాటు వీడియో అనలిస్ట్ నితిన్ కుమార్‌లు కూడా పాజిటివ్‌గా తేలడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం. నెగెటివ్ వచ్చిన ఇతర బాక్సర్లు ఇండియాకు తిరిగి వచ్చారు. కాగా, పాజిటివ్ అయిన బాక్సర్లు మరో వారం పాటు ఇస్తాంబుల్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.


Next Story