POK బోర్డర్‌లో తేజస్ యుద్ధ విమానాలు..

by  |
POK బోర్డర్‌లో తేజస్ యుద్ధ విమానాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు మనతో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దాయాది పాక్‌తో స్వాతంత్ర్యం నాటి నుంచి జమ్మూకశ్మీర్ విషయంలో వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రాగన్ కంట్రీ వాస్తవాధీన రేఖ వెంబడి కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఇండియా భూభాగాన్ని తమ భూభాగాలు చిత్రీకరిస్తూ యుద్దతంత్రానికి తెరతీస్తోంది. ఈనేపథ్యంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్రమత్తమైంది. ఈ రెండు దేశాలతో ఎప్పటికైనా ముప్పు ఉందని భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే పాక్ బోర్డర్‌లో దేశీయంగా తయారైన తేజస్ యుద్ధవిమానాలను మొహరించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) ప్రకటించింది. లడఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA) తేజస్ యుద్ధ విమానాల 45 స్క్వాడ్రన్ సౌత్ ఎయిర్ కమాండ్ పరిధిలోని కోయంబత్తూరు సమీపంలో గల సులూరు వైమానిక స్థావరంలో ఉంది.

ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా తేజస్ స్క్వాడ్రన్‌ను ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దు వైమానిక స్థావరానికి తరలించినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. 74స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండావిష్కరణ అనంతరం ప్రసంగించిన ప్రధాని మోడీ మేడిన్ ఇండియాలో భాగమైన తేజస్ యుద్ధ విమానాల పరాక్రమణను ప్రశంసించారు. (LAC) మార్క్1ఏ వర్షన్ యుద్ధ విమానాలు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని మోడీ స్పష్టంచేశారు.

మరోవైపు, చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల వలన సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన గట్టి నిఘా పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న 5 రాఫెల్ యుద్ధవిమానాలను కూడా రంగంలోకి దించింది. సరిహద్దు ప్రాంతాల్లో పగలు, రాత్రిపూట విన్యాసాలు చేస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు (IAF) సర్వసన్నద్ధంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed