తొలి టీ20 భారత్‌దే

by  |
తొలి టీ20 భారత్‌దే
X

అర్ధసెంచరీతో రాణించిన సూర్యకుమార్
శ్రీలంకను కుప్పకూల్చిన భువనేశ్వర్
టీ20 సిరీస్‌లో 1-0తో ధావన్ సేన ఆధిక్యం

కోలంబో : వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న ధావన్ సేన టీ20 సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించింది. తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగడంతో లంకేయులు కుప్పకూలారు. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు 126 పరుగులకే ఆలౌటైంది. తొలి టీ20ని గెలిచిన టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యత సాధించింది.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 5 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టుకు శుభారంభం దక్కలేదు. 50 పరుగులకే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మినాంద్ బానుక (10) భువనేశ్వర్ బౌలింగ్‌లో కృనాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాసేపటికే ధనుంజయ డి సిల్వ (9)ను చాహల్ పెవీలియన్ పంపాడు. నిలకడగా ఆడుతున్న అవిష్కా ఫెర్నాండో (26) భువనేశ్వర్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత చరిత్ అసలాంకా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అషెన్ బండర తడబడ్డాడు. నాల్గో వికెట్‌కు వీరిద్దరు 40 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అషెన్ బండర (9)ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. కాసేపటికే దీపక్ చాహర్‌ బౌలింగ్‌లో చరిత్ అసలాంకా (44), వానింద్ హసరంగా (0) వరుసగా అవుటయ్యారు. చమికా కరుణరత్నే (3), దసన్ షనక (16), ఇసురు ఉదాన (1), దుష్‌మంత చమీరా (1) వరుసగా పెవీలియన్ చేరారు. 126 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమ్ ఇండియా 38 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గి 1-0తో ఆధిక్యత సాధించింది. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో రెచ్చిపోగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

ధావన్, సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్‌లో తొలి బంతికే ఓపెనర్ పృథ్వీషా (0) అవుటయ్యాడు. చమీరా బౌలింగ్‌లో షా కీపర్ బానుకకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్, సంజూ శాంసన్ దూకుడుగా ఆడారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఈ జోడీని వానింద్ హసరంగా విడదీశాడు. హసరంగా బౌలింగ్‌లో శాంసన్ (27) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ ధాటిగా ఆడాడు. ధావన్, సూర్యకుమార్ కలిసి లంక బౌలర్ల ఉతికారేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో కరుణరత్నే బౌలింగ్‌లో ధావన్ (44) అవుటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ 2 సిక్స్‌లు, 5 ఫోర్ల సహాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కాసేపటికే సూర్యకుమార్ (50) హసరంగా బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా (10) మరోమారు విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ (20) నిలకడగా ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 164 పరుగులు చేసింది. చమీరాకు, హసరంగా చెరో 2 వికెట్లు తీయగా, కరుణరత్నేకు ఒక్క వికెట్ దక్కింది.

స్కోర్ బోర్డు
టీమ్ ఇండియా
పృథ్వీషా (సి) బానుక (బి) చమీరా 0, ధావన్ (సి) అషెన్ బండర (బి) కరుణరత్నే 46, శాంసన్ ఎల్బీడబ్ల్యూ (బి) హసరంగా 27, సూర్యకుమార్ (సి) మెండిస్ (బి) హసరంగా 50, హార్దిక్ పాండ్యా (సి) బానుక (బి) చమీరా 10, ఇషన్ కిషన్ 20 నాటౌట్, కృనాల్ పాండ్యా 3 నాటౌట్ ; ఎక్సట్రాలు 8 ; 20 ఓవర్లు ; మొత్తం 164/5

వికెట్ల పతనం : 0-1, 51-2, 113-3, 127-4, 153-5

బౌలింగ్ : చమారా (4-0-24-2), కరుణ రత్నే (4-0-34-1), ధనుంజయ (3-0-4-0), ఉదాన (4-0-32-0), హసరంగా (4-0-28-2), షనక (1-0-4-0)

శ్రీలంక జట్టు

అవిష్కా ఫెర్నాండో (సి) శాంసన్ (బి) భువనేశ్వర్ 26, మినాంద్ బానుక (సి) సూర్యకుమార్ (బి) కృనాల్ పాండ్యా 10, ధనుంజయ (బి) చాహల్ 9, అసలాంకా (సి) పృథ్వీషా (బి) చాహర్ 44, అషెన్ బండర (బి) హార్దిక్ పాండ్యా 9, దషన్ షనక (స్టంప్) ఇషాన్ కిషన్ (బి) చక్రవర్తి 16, హసరంగా (బి) చాహర్ 0, కరుణరత్నే (బి) భువనేశ్వర్ 3, ఉదాన (సి) సూర్యకుమార్ (బి) భువనేశ్వర్ 1, చమీరా (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 1, అఖిల ధనుంజయ 1 నాటౌట్ ; ఎక్సట్రాలు 6 ; 18.3 ఓవర్లు ;మొత్తం 126/10

వికెట్ల పతనం : 23-1, 48-2, 50-3, 90-4, 111-5, 111-6, 122-7, 124-8, 125-9, 126-10

బౌలింగ్ : భువనేశ్వర్ (3.3-0-22-4), చాహర్ (3-0-24-2), కృనాల్ (2-0-16-1), చక్రవర్తి (4-0-28-1), చాహల్ (4-0-19-1), హార్దిక్ (2-0-17-1)



Next Story

Most Viewed