ఇంగ్లాండ్‌తో టీమ్ ఇండియా పోరాటం

by  |
ఇంగ్లాండ్‌తో టీమ్ ఇండియా పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య భారత జట్టుకు పర్యాటక ఇంగ్లాండ్ జట్టు చుక్కలు చూపిస్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి టీమ్ ఇండియాను కష్టాల్లోకి నెట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లు టాప్ ఆర్డర్‌ను కూల్చేశారు. పంత్, పుజార మరోసారి అద్భుత బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టడమే కాకుండా కనీసం ఈ రోజు ఆలౌట్ కాకుండా నిలిచింది. మరోసారి వాషింగ్టన్ సుందర్ తన బ్యాటింగ్ ప్రతిభతో నిలబడ్డాడు. ప్రస్తుతం సుందర్‌తో పాటు క్రీజులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ పైనే టీమ్ ఇండియా ఆశలు పెట్టుకుంది.

555/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 23 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. డోమెనిక్ బెస్ (34)ను జస్ప్రిత్ బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేయగా.. అండర్సన్ (1) అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో బ్యాటింగ్ చేసిన లీచ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా చెరి మూడు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, షాబాజ్ నదీమ్‌కు తలా రెండు వికెట్లు లభించాయి.

ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ రోహిత్ శర్మ (6) ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్, చతేశ్వర్ పుజార కలసి ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రయత్నించారు. అయితే గిల్ దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నిం చేశాడు. 5 ఫోర్లు బాది నిలదొక్కుకున్నాడు. అనుకున్న సమయంలో ఆర్చర్ బౌలింగ్‌లో అండర్సన్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్ (29) పెవీలియన్ చేరాడు. వన్డే తరహాలో ఆడిన గిల్.. ఇంగ్లాండ్ జట్టు వ్యూహానికి బలయ్యాడు. దీంతో 44 పరుగులకే టీమ్ ఇండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. కాగా చతేశ్వర్ పుజార, కోహ్లీ కలసి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. అప్పటికి టీమ్ ఇండియా స్కోర్ 59/2

రెండో సెషన్ ప్రారంభించిన కొద్దిసేపటికే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవీలియన్ చేరాడు. డామ్ బెస్ వేసిన బంతి అనూహ్యంగా తిరిగి కోహ్లీ బ్యాట్‌కు ఇన్‌సైడ్ తీసుకొని ఎడ్జ్ తీసుకొని ఓలీ పోప్ చేతిలో పడింది. ఆ బంతిని అంచనా వేయడంలో కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 1 పరుగు చేసిన రహానే డామ్ బెస్ బౌలింగ్‌లోనే జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఎండ్‌లో చతేశ్వర్ పుజార తన సహజ శైలిలో బ్యాటింగ్ చేస్తూ వికెట్ కాపాడుకున్నాడు.

ఆ తర్వాత రిషబ్ పంత్ క్రీజులో అడుగుపెట్టాడు. 3 పరుగులతో బోణీ కొట్టిన పంత్.. ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది.. తాను ఎలా బ్యాటింగ్ చేయబోతున్నాడో ముందే చెప్పాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సులు, పేసర్ల బౌలింగ్‌లో బౌండరీలు బాదుతూ టెస్ట్ మ్యాచ్‌ను కాస్తా టీ20లా మార్చేశాడు. ఒక ఎండ్‌లో పుజార ఆచితూచి ఆడుతుండగా.. మరో ఎండ్‌లో పంత్ తన సహజశైలిలో రెచ్చిపోయాడు. పంత్ క్రీజులోకి వచ్చినప్పుడు పుజార 26 పరుగుల వద్ద ఉన్నాడు. అయితే వీరిద్దరూ ఒకే ఓవర్‌లో అర్ద సెంచరీలు చేయడం విశేషం. జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ తొలి బంతికి పుజార బౌండరీ బాది అర్ద సెంచరీ పూర్తి చేయగా.. అదే ఓవర్ 5వ బంతికి పుజార ఫోర్ కొట్టి అర్ద సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 40 బంతుల్లోనే పంత్ హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. పంత్, పుజార ఆదుకోవడంతో టీ విరామ సమయానికి టీమ్ ఇండియా 154/4 స్కోర్ చేసింది.

ఇక కీలకమైన మూడో సెషన్‌‌ను కూడా దూకుడుగా ప్రారంభించారు. పంత్ ఒకవైపు బౌండరీలు సిక్సులతో వేగంగా ఆడుతుండగానే పుజార కూడా గేర్ మార్చి పరుగుల వేగం పెంచాడు. వీరిద్దరూ మూడో సెషన్‌ను ముగిస్తారని అందరూ భావించారు. అయితే డామ్ బెస్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించిన ఈ జోడీని బెస్ విడదీశాడు. ఇన్నింగ్స్ 51వ ఓవర్లో బెస్ వేసిన బంతికి బర్న్స్‌కు క్యాచ్ ఇచ్చి పుజార (73) పెవీలియన్ చేరాడు. గత కొంత కాలంగా తొంబైల్లో అవుటవుతూ సెంచరీలు మిస్ అవుతున్న పంత్.. ఈ సారి కూడా అదే తప్పు చేశాడు.

దూకుడుగా ఆడే క్రమంలో బెస్ బౌలింగ్‌లో జాక్ లీచ్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ (91) అవుటయ్యాడు. కేవలం 88 బంతుల్లోనే పంత్ 91 పరుగులు చేయడం గమనార్హం. ఇక ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ కలసి మరో వికెట్ పడకుండా క్రీజులో నిలిచారు. వాషింగ్టన్ సుందర్(33) మరో సారి తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు. అతడికి రవిచంద్రన్ అశ్విన్ (8) తోడుగా నిలిచాడు. 54 బంతులు ఆడిన అశ్విన్ కేవలం 8 పరుగులే చేసినా.. ఇంగ్లాండ్ బౌలర్లను మాత్రం సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. వీరిద్దరూ కలసి మూడో రోజు మరో వికెట్ పడకుండా 257/6 వద్ద ఆటను ముగించారు. డామ్ బెస్ 4, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశారు. ఇండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 121 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటం.. అందరూ టెయిలెండర్లు కావడంతో అన్ని పరుగులు చేయడం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం భారమంతా సుందర్, అశ్విన్ పైనే ఉన్నది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్

రోరీ బర్న్స్ (సి) పంత్ (బి) అశ్విన్ 33, డామినిక్ సిబ్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 87, డానియల్ లారెన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0, జో రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నదీమ్ 218, బెన్ స్టోక్స్ (సి) పుజారా (బి) నదీమ్ 82, ఓలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 34, జాస్ బట్లర్ (బి) ఇషాంత్ 30, డామినిక్ బెస్(ఎల్బీడబ్ల్యూ)(బి) బుమ్రా 34, జోఫ్రా ఆర్చర్ (బి) ఇషాంత్ 0, జాక్ లీచ్ 6 14 నాటౌట్, జేమ్స్ అండర్సన్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు 45; మొత్తం (190.1 ఓవర్లు) 578 ఆలౌట్

వికెట్ల పతనం: 63-1, 63-2, 263-3, 387-4, 473-5, 477-6, 525-7, 525-8, 9-567, 10-578

బౌలింగ్: ఇషాంత్ శర్మ(27-7-52-2), బుమ్రా(36-7-84-3), అశ్విన్(55.1-5-146-3), నదీమ్(44-4-167-2), వాషింగ్టన్ సుందర్(26-2-98-0), రోహిత్ శర్మ(2-0-7-0)

ఇండియా తొలి ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (సి) జాస్ బట్లర్ (బి) జోఫ్రా ఆర్చర్ 6, శుభమన్ గిల్ (సి) జేమ్స్ అండర్సన్ (బి) జోఫ్రా ఆర్చర్ 29, చతేశ్వర్ పుజార (సి) రోరీ బర్న్స్ (బి) డామ్ బెస్ 73, విరాట్ కోహ్లీ (సి) ఓలీ పోప్ (బి) డామ్ బెస్ 11, అజింక్య రహానే (సి) జో రూట్ (బి) డామ్ బెస్ 1, రిషబ్ పంత్ (సి) జాక్ లీచ్ (బి) డామ్ బెస్ 91, వాషింగ్టన్ సుందర్ 33 బ్యాటింగ్, రవిచంద్రన్ అశ్విన్ 8 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (74 ఓవర్లు) 257/6

వికెట్ల పతనం : 1-19, 2-44, 3-71, 4-79, 5-192, 6-225

బౌలింగ్ జేమ్స్ అండర్సన్ (11-3-34-0), జోఫ్రా ఆర్చర్ (16-3-52-2), బెన్ స్టోక్స్ (6-1-16-0), జాక్ లీచ్ (17-2-94-0), డామ్ బెస్ (23-5-55-4), జో రూట్ (1-0-1-0)



Next Story

Most Viewed