చుక్కలు చూపిస్తున్న హీట్ వేవ్… దీని కథేందో!

by  |
చుక్కలు చూపిస్తున్న హీట్ వేవ్… దీని కథేందో!
X

ఐదు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. బయట కోడిగుడ్డు పగలగొడితే రెండు నిమిషాల్లో ఆమ్లెట్ అవుతుందేమోనన్న విధంగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఎండకు కారణం హీట్ వేవ్. ఇప్పటికే ఐదు రాష్ట్రాలను తగిలిని ఈ హీట్ వేవ్ మున్ముందు దారుణంగా మారబోతోందని వాతావరణ అధికారులు అంటున్నారు. అయితే గత సంవత్సరాలతో పోల్చితే 2020 వేసవి అసాధారణంగా ఉండనుందని వారు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకున్నాయి. అయితే మొన్నటికి ఐదు రోజుల ముందు వానలు పడి, ఇప్పటికిప్పుడే ఇలా ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడం ఏంటని చాలా మందికి అర్థం కాట్లేదు. అందుకు కారణమే ఈ హీట్ వేవ్.

హీట్ వేవ్ అంటే ఏమిటి?

సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో పోల్చితే ఒకేసారి 4 నుంచి 5 డిగ్రీలు పెరగడాన్నే హీట్ వేవ్‌గా పరిగణిస్తారు. ఉష్ణోగ్రత 40 దాటితే సాధారణ హీట్ వేవ్ అని, 45 డిగ్రీలు దాటితే తీవ్ర హీట్ వేవ్ అని అంటారు. హీట్ వేవ్‌గా డిక్లేర్ చేయడానికి వరుసగా రెండు రోజుల పాటు రెండు వాతావరణ సబ్‌డివిజన్ కేంద్రాల్లో 40 నుంచి 45 డిగ్రీలు దాటాల్సి ఉంటుంది. ఈ డేటాను పరిశీలించి మూడో రోజున భారత వాతావరణ కేంద్రం హీట్ వేవ్‌గా ప్రకటిస్తుంది.

హీట్ వేవ్ ఎన్ని రోజులు ఉంటుంది?

ఒక్కసారి హీట్ వేవ్ డిక్లేర్ చేసిన తర్వాత అది దాదాపు నాలుగు రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఏడు నుంచి పది రోజుల పాటు కూడా ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి చేసుకున్న కారణంగా తగ్గిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. కానీ మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.

హీట్ వేవ్ దేశం మొత్తం ఒకేసారి వస్తుందా?

థార్ ఎడారి ఉన్న రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో హీట్ వేవ్ చాలా సాధారణం. అలాగే ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా సంవత్సరానికి ఐదు నుంచి ఆరు సార్లు హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని కోర్ హీట్‌వేవ్ జోన్లుగా ఐఎండీ గుర్తించింది. అయితే దక్షిణ భారతదేశంలో ఈ హీట్ వేవ్ ప్రభావం కొద్దిగా తక్కువగానే ఉంటుంది.

కారణం సైక్లోన్ అంఫాన్?

అంఫాన్ తుఫాన్ వచ్చింది వెళ్లిపోయింది, అయితే తోడుగా హీట్ వేవ్‌ను కూడా తీసుకొచ్చిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తుఫాన్ కారణంగా వచ్చిన చల్లదనం, తుఫాన్ వెళ్లిపోయిన తర్వాత హీట్ వేవ్‌గా పరిణమించింది.


Next Story