మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడండి : సీఎస్ఏ

by  |
మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడండి : సీఎస్ఏ
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా భారత పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని దక్షిణాఫ్రికా జట్టు స్వదేశానికి వెళ్లిపోయిన విషయం విదితమే. ఆ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వస్తున్నట్లు క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) ప్రకటించింది. ఆ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో సీఎస్ఏకు ఆదాయం తగ్గిపోయింది. ఇండియాతో ఆడితే ఆదాయం వస్తుందనే ఆలోచనతో మరోసారి బీసీసీఐను సంప్రదించింది. యూఏఈలో ఐపీఎల్‌కు ముందు అక్కడే తమతో మూడు వన్డేలు ఆడాలని బీసీసీఐ ముందు ప్రతిపాదన పెట్టింది. ఆగస్టు ఆఖరు లోగా మూడు వన్డేలు ఆడితే ఇరు జట్లకు ఉపయోగకరంగా ఉంటుందని సీఎస్ఏ అంటున్నది. ‘సీఎస్ఏ మూడు వన్డేలు ఆడాలని కోరిన విషయం వాస్తవమే. కానీ, ఇప్పుడు బీసీసీఐ దృష్టంతా ఐపీఎల్ నిర్వహణ మీదే ఉన్నది. ప్రభుత్వ అనుమతులు, లాజిస్టిక్స్, నిర్వహణ పనులపై చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ఈ సమయంలో సీఎస్ఏ ప్రతిపాదనపై మాట్లాడేది ఏమీ లేదు. ఇప్పుడు కామెంట్ చేయడం తొందరపాటే అవుతుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్ అటు సీఎస్ఏకే కాక స్టార్ ఇండియాకు కూడా ముఖ్యమే. ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయింది. కనీసం దక్షణాఫ్రికా పర్యటన అయినా జరిగితే కాస్తో కూస్తో రాబడి ఉంటుందని భావిస్తూ బీసీసీఐపై ఒత్తిడి తెస్తున్నది.



Next Story

Most Viewed