‘ఉగ్ర’ కరోనా.. రెండోరోజూ 2 లక్షల పైనే కేసులు..

by  |
‘ఉగ్ర’ కరోనా.. రెండోరోజూ 2 లక్షల పైనే కేసులు..
X

న్యూఢిల్లీ : రెండో దశలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. వరుసగా రెండో రోజూ దేశంలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రమాదఘంటికలు మోగిస్తున్న కరోనా.. తొలి దశను మించిన కేసులు, మరణాలను నమోదు చేస్తున్నది. ఈ దశ ఇలాగే కొనసాగితే రోజూవారీ కేసులలో అమెరికా (రోజుకు 3 లక్షలు) దాటేయడం ఈ మాసాంతంలోనే చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరీ ముఖ్యంగా గడిచిన పది రోజులుగా వైరస్ ఉధృతి చూస్తే ఇది నిజమనిపించకమానదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,17,353 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. 1,185 మంది మరణించారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.42 కోట్లు దాటగా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది. ఇక క్రియాశీల కేసుల సంఖ్య రోజుకు 80 వేలకు మించి నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తున్నది. తాజా గణాంకాల ప్రకారం.. యాక్టివ్ కేసుల సంఖ్య 15,69,743 కు చేరింది. దీంతో క్రియాశీల కేసుల రేటు 10.46 శాతానికి చేరువైంది. కొవిడ్ ఫస్ట్ ఫేజ్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇది 11 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న యాక్టివ్ కేసులు అత్యల్పంగా 1,35,926 గా ఉన్న విషయం విదితమే.

నెల రోజుల్లో అల్లకల్లోలం..

కరోనా పీడ విరగడైందనుకున్న తరుణంలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతం నుంచి దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. మహారాష్ట్రలో మొదలైన ఆ విలయం.. మెల్లగా దేశమంతా పాకింది. 2020 మార్చి 10 నాటికి దేశంలో రోజూవారీ కేసులు 15,338 కాగా, 77 మరణాలు నమోదయ్యాయి. అదేనెలలో 26 వ తేదీ నాటికి కేసులు 50 (53,476) వేలు దాటాయి. యాక్టివ్ కేసులు 3,95,192 గా ఉన్నాయి. పది రోజుల అనంతరం అంటే ఈ నెల 5న దేశంలో కరోనా కేసులు తొలిసారి లక్ష (1,03,558) దాటాయి. ఇక అప్పట్నుంచి అంతకుముందు రోజుకు వచ్చిన కేసులకు 15 వేలు పెంచుకుంటూ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గడిచిన వరుసగా ఆరు రోజులుగా 1.50 లక్షల కేసులు రికార్డవుతున్నాయి. ఇక బుధవారం 2.03 లక్షలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య గురువారానికి 2.17 లక్షలు దాటింది. రోజూవారీ కేసులలో వరుసగా 37 వ రోజు కరోనా కేసులలో పెరుగుదల కనిపించింది. ఈ రకంగా చూస్తే ఏప్రిల్ మాసాంతం నాటికి కరోనా ఉగ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తున్నది.

ప్రముఖులకు కరోనా..

దేశంలో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరిలో శిరోమణి అకాళీదళ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవాని కూడా కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకూ కరోనా సోకినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్..! ‘సుప్రీం’లో సోమవారం విచారణ

దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. వచ్చే సోమవారం (ఏప్రిల్ 19న) దీనిపై విచారణ చేపట్టనుంది.

Next Story

Most Viewed