ఆర్థిక వ్యవస్థకు కరోనా సోకింది!

by  |
ఆర్థిక వ్యవస్థకు కరోనా సోకింది!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న మహమ్మారి. ఈ మహమ్మారి ప్రజలకే కాకుండా దేశాల ఆర్థిక వ్యవస్థలకు కూడా సంకటంగా మారింది. ముఖ్యంగా ఇండియా దిగుమతులకు చైనానే ప్రధాన కేంద్రం కావడం, ఎక్కువ శాతం ముడిసరుకుల పరిశ్రమలు మూసివేయడంతో ఇండియాలోని తయారీ రంగంపై అధిక ప్రభావం కనబడుతోంది. ఇండియా ఎగుమతులపై కూడా కరోనా ప్రభావం కనబడుతోంది. ఈ కారణంగా దేశీయంగా వస్తువుల ధరలు పెరగడమే కాకుండా కొరత కూడా ఏర్పడనుంది.


ఇటీవల ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి. పాతికకు పైగా కేసులు నమోదు కావడం చూస్తే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇండియా దిగుమతులు, ఎగుమతులపై కరోనా ప్రభావం మరింత పెరగనుందనే భావన పరిశ్రమ వర్గాల్లో మొదలైంది. తాజాగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఇచ్చిన నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇండియా వృద్ధిరేటు 5.1 శాతంగా ఉంటుందనే అంచనాను వెల్లడించింది. ఈ ఏడాది వృద్ధి పెరిగితే 2021-22 నాటికి వృద్ధి రేటు 5.6 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. అలాగే, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కరోనా వైరస్ దేశీయంగా వాణిజ్యంపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని తెలిపింది. ప్రధానంగా పర్యాటక రంగం, ఫినాన్స్ మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు అధికంగా దెబ్బతింటాయని అభిప్రాయపడింది.

ఇండియా వాణిజ్య పరిశ్రమ అధికంగా చైనా దేశంపై ఆధారపడటమే మన ఎగుమతులు, దిగుమతులకు కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. 2003 ఏడాదిలో సార్స్ వ్యాధి వచ్చినప్పటి కంటే ఇప్పుడే అధికంగా మన దేశ వ్యాపారం చైనాపై ఆధారపడింది. సార్స్ వచ్చిన సమయంలో దాని ప్రభావం ఒక్క శాతమే ఉండేదని నివేదిక చెబుతోంది. పర్యాటకం, వాణిజ్యం, ప్రపంచ ఉత్పాదక రంగం, కమొడిటీ మార్కెట్లలో చైనా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇండియానే కాకుండా అంతర్జాతీయంగా చాలా దేశాలు చైనాపై ఆధారపడున్నాయి. 2002-03 ఆర్థిక సంవత్సరంలో చైనాతో వాణిజ్య విలువ రూ. 34 వేల కోట్లు ఉండేది. అయితే, 2018-19 నాటికి ఈ విలువ 18 రెట్లు పెరిగి రూ. 6 లక్షల కోట్లకు చేరుకుంది.


ఇండియా మొత్తం ఎగుమతుల్లో 5 శాతానికి పైగా ఎగుమతులతో చైనా మూడోస్థానంలో ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్, కెమికల్స్, మత్స్య పరిశ్రమల నుంచి ఉత్పత్తులు అధికంగా ఎగుమతుల జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా కంపెనీలు చైనాలో కర్మాగారాలను కొనసాగిస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఆయా కంపెనీల ఉత్పత్తులు నష్టాన్ని చూడవలసి వస్తుంది. వీటిలో తయారీ రంగంతోపాటు ఐటీ, కెమికల్స్, బీపీవో, లాజిస్టిక్స్, టూరిజం వంటి రంగాలు ముందుగా నష్టాల్ని చూడాల్సి వస్తుంది. చైనాలో ఇదివరకే మూతపడిన టెక్స్‌టైల్స్ పరిశ్రమల వల్ల ఇండియాలో బట్టలు, నూలు, ఇంకా ఇతర ముడి పదార్థాలకు డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ జీడీపీలో చైనా వాటా ఐదోవంతుతో 18.69 శాతంగా ఉంది. చైనా వృద్ధిరేటులో మార్పులు సంభవిస్తే అది అంతర్జాతీయంగా వివిధ దేశాలపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. చైనా అంతర్జాతీయంగా 13 శాతం ఎగుమతులను, దిగుమతిలో 11 శాతంతో రెండో అతిపెద్ద దేశంగా ఉంది. కరోనా ధాటికి ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు మూసివేయబడ్డాయి. సుమారు 50 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. ఈ పరిణామాలతో ప్రపంచ జీడీపీ కనీసం 0.5 శాతం ప్రభావితమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి ఇంకా కొనసాగుతోంది కాబట్టి ఈ ప్రభావం ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.


ఇక కరోనా దెబ్బకు ఇండియాలో దిగుమతులు కూడా అత్యధికంగా ప్రభావితమవుతున్నాయి. దేశీయంగా తయారీ రంగంలో ఉపయోగించే ముడి సరుకులు అధికంగా చైనా నుండే దిగుమతి అవుతాయి. వీటిలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువులు 45 శాతం. ఇవి కాకుండా మూడోవంతు యంత్ర పరికరాలు చైనా నుంచే ఇండియాకు దిగుమతులు అవుతున్నాయి. 40 శాతం ఆర్గానిక్ కెమికల్స్ చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగం ప్రధాన దిగుమతి విభాగం. ఇందులో కీలకమైన ముడి పదార్థాలు సుమారు 70 శాతం చైనాలో తయారుచేయబడుతున్నవే. మరో రంగం ఆటోమొబైల్.. ఇందులో విడిభాగాలు, ఫర్టిలైజర్స్ 25 శాతం చైనా నుంచే రావాలి. వీటితో పాటు, మొబైల్‌ఫోన్ల విడి భాగాలు 90 శాతం వరకూ చైనా నుంచే వస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం కెమికల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్ రంగాలు కరోనా వ్యాప్తి కారణంగా వాటి ధరలను 10 శాతం వరకూ పెంచే అవకాశాలున్నాయని చెబుతోంది.


ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. కరోనా కారణంగా ఇండియా వజ్రాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం కనబడుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుసేనాటికి రూ. లక్ష కోట్లకు దిగజారనుందని ఓ రేటింగ్ సంస్థ నివేదిక ఇచ్చింది. 2018-19లో ఇండియా నుంచి వజ్రాల ఎగుమతులు రూ. 1.70 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ఇండియా నుంచి 18 శాతం వజ్రాల ఎగుమతులు మాత్రమే జరిగాయి. ఇందులో హాంకాంగ్‌కి వెళ్లే 40 శాతం ఎగుమతులు జనవరి నుంచి నిలిచిపోయాయి.

ఎలక్ట్రానిక్ రంగంలో ఇండియాకు అతిపెద్ద ఎగుమతిదారు డ్రాగన్ కంట్రీయే. ముడి సరుకుల నుంచి తయారయ్యే వస్తువులు పెద్ద సంఖ్యలో ఇండియాకు వస్తూ ఉంటాయి. కరోనా వల్ల చైనాలో పరిశ్రమలు మూతపడటంతో ఉత్పత్తి తగ్గిపోవడం, ముడిసరుకుల కొరత ఏర్పడటం, ధరలు పెరగడం లాంటి ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఆటోమొబైల్ రంగం కూడా కనీసం 10 శాతం విడిభాగాల కొరతను ఎదుర్కొనక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా నుంచి బల్క్‌డ్రగ్స్ అధికంగా ఇండియాకు దిగుమతి అవుతాయి. వీటి ద్వారానే ఔషధాలు తయారుచేసి అంతర్జాతీయంగా ఇండియా ఎగుమతి చేస్తోంది. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఈ పరిశ్రమ మొదటగా ప్రభావితమవుతుంది. ఇక, చైనాలో కరోనా వల్ల కొత్త సంవత్సరం సెలవులను ఇంకొద్ది రోజులు పెంచితే అది ఐటీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఎక్కువగా ఐటీ సంస్థల రాబడి, వృద్ధి రేటుపై ఈ ప్రభావం కనబడుతోంది.

Tags : coronavirus effect, coronavirus effect on india imports, india exports, china, wuhan


Next Story