‘బలగాల ఉపసంహరణ జరగాలి’

by  |
‘బలగాల ఉపసంహరణ జరగాలి’
X

న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు దారులు సుగమమవుతున్నాయి. కార్ప్స్ కమాండర్ స్థాయి మిలిటరీ చర్చలు ఫలప్రదమైన రెండు రోజుల తర్వాత జరిగిన దౌత్యాధికారుల భేటీ సఫలమైంది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, బలగాలను వెనక్కి తీసుకోవడంపై రెండు దేశాలు ఇప్పటికే అంగీకరించిన ఒప్పందాలను పాటించాలని భారత్, చైనా దౌత్యధికారులు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో నిర్ణయించారు.

ఇరుదేశాల నేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాలను, ఒప్పందాలను గౌరవించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్(బౌండరీ, సముద్రజలాల వ్యవహారాల శాఖ) హోంగ్ లియాంగ్‌ల నేతృత్వంలో బుధవారం సమావేశం జరిగింది. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోయేవరకూ దౌత్య, మిలిటరీ మార్గాల్లో చర్చలు జరిగేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఎల్ఏసీని కచ్చితంగా గౌరవిస్తూ సరిహద్దులో పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని ఈ సమావేశంలో భాతర దౌత్య అధికారులు నొక్కి చెప్పారు. కాగా, గాల్వన్ లోయ మాదేనన్న వాదనను చైనా పక్షం పునరుద్ఘాటించింది. కాగా, జూన్ 22న మిలిటరీ చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని, ఇదివరకు రెండు దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దులో శాంతి నెలకొనేలా బలగాలను ఉపసంహరించుకునేందుకు రెండు దేశాలు ఈ భేటీలో అంగీకరించాయి.



Next Story

Most Viewed