2021 చివరినాటికి 4 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్‌లు!

by  |
2021 చివరినాటికి 4 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్‌లు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021లో 5జీ స్మార్ట్‌ఫోన్ రవాణా సుమారు 4 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందని, ఈ విభాగంలో ప్రధానంగా వన్‌ప్లస్, యాపిల్ వంటి బ్రాండ్ ఉత్పత్తులు పటిష్ఠమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటాయని ప్రముఖ పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. 2020 మూడో త్రైమాసికంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా దెబ్బతిన్నప్పటికీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా కోలుకుందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఎగుమతుల పరంగా సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉత్తమ త్రైమాసికంగా నమోదైందని, ముఖ్యంగా డిమాండ్‌తో పాటు కొత్త కస్టమర్లు భారీగా పెరిగినట్టు కౌంటర్ పాయింట్ వివరించింది.

భారత్‌లో గతేడాది తొలి త్రైమాసికంలో మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అయితే, అధిక ధరలు, 5జీ నెట్‌వర్క్ లేకపోవడంతో అమ్మకాల పరంగా నెమ్మదిగా ఉంది. అయితే, ఆగష్టు తర్వాత 5జీ విభాగంలో అనూహ్యమైన అమ్మకాలు నమోదయ్యాయని పరిశోధనలో తేలింది. 2020, సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 17 లక్షల యూనిట్లుగా ఉన్నాయని, ఇది 2020 చివరి నాటికి 40 లక్షలు దాటాయనే అంచనాలున్నాయని కౌంటర్ పాయింట్ వెల్లడించింది.

Next Story

Most Viewed