జాతీయ జెండాకు 74 ఏళ్లు పూర్తి.. జెండా రూపకల్పన జరిగింది ఎక్కడో తెలుసా?

by Dishafeatures2 |
జాతీయ జెండాకు 74 ఏళ్లు పూర్తి.. జెండా రూపకల్పన జరిగింది ఎక్కడో తెలుసా?
X

దిశ, కోదాడ: స్వతంత్ర భారతావనిలో ప్రతి భారతీయుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ గుండె నిండా నింపుకున్నదే ఆ మువ్వన్నెల త్రివర్ణ పతాకం. ఆ పతాకం ఆవిర్భవించి ఈ ఏటితో 74సంవత్సరాలు పూర్తయింది. అప్పట్లో జాతిపిత మహాత్మాగాంధీ సూచన మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) మునగాల మండలం నడిగూడెం రాజవారి కోటలో పింగళి వెంకయ్య మన జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. 1947 జులై 22న జాతీయ జెండాపై రాజ్యాంగ సభలో తీర్మానం ఆమోదించడం జరిగింది. మువ్వన్నెల పతాకం 130 కోట్ల మంది భారతీయులు సగర్వంగా నమస్కరించే జెండా. భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపు దిద్దుకుంది ఇక్కడే!.ఈ కోట గదుల్లోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రంగులద్దారు. 75 వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నడిగూడెం కోటలో రూపుదిద్దుకున్న జాతీయ జెండాపై ప్రత్యేక కథనం...

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి. జాతీయ ఉద్యమ నాయకుడు ఆ స్వతంత్రోద్యమ కార్యసిద్ధి చేతిలోనే జాతీయ పతాకం రూపుదిద్దుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పతాకం తెలంగాణలోని రూపొందించిన విషయం కొంతమందికి తెలుసు. 1875లో జమిందారీ రుక్కమ్మ అనే మహిళ భాద్యతలు చేపట్టింది. ఆమె హయాంలో నడిగూడెంలో ఉన్న ప్రస్తుత రాజావారి కోట(గడి) నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది.

మువ్వన్నెల జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య నివసించిన భవనం నేడు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. జాతీయ జెండా రూపకల్పనకు వేదిక అది. జమీందార్ల పాలనలో ఆనాడు రాజభవనంగా కళకళలాడింది. ఇప్పుడు మాత్రం పట్టించుకునే నాధుడు లేక వెలవెలబోతోంది. స్వాంతంత్య్రానికి ముందు జమీందార్లుగా ఉన్న రంగారావు కుటుంబీకులు ఇక్కడి నుంచే పరిపాలన సాగించేవారు. గడీలు, జమీందారి వ్యవస్థ అంటే మనకు వెంటనే గుర్తుకువచ్చేది అరాచకం, బానిసత్వం, అలాంటి గడీల్లో ఎత్తైన బురుజులు, రాచరిక వ్యవస్థ అందుకు పూర్తి భిన్నంగా స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన కోట నడిగూడెం కోట. నడిగూడెం కోటను కేంద్రంగా చేసుకొని మునగాల పరగణాను జమిందార్ రాజా నాయిని వెంకట రంగారావు పాలించేవారు.


తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రెండు ప్రాంతాలు ఈ సంస్థానం ఆధీనంలో ఉండడంతో గడిగాను, కోటగాను పిలిచేవారు. ఇక్కడ దొరల అరాచకాలు, బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు ఉండేవి. ఎత్తైన గోడలతో తొమ్మిది ఎకరాల సువిశాల ప్రాంతంలో ఈ కోటను 1875 లో నిర్మించారు. ఈ సంస్థానంలో మునగాల, నడిగూడెం, తాడ్వాయి, రేపాల, కరివిరాల, సిరిపురం, రామాపురం, వెలిదండ, కొక్కిరేణి, ఆంధ్రలో నందిగామ సహా 40 గ్రామాలు ఉండేవి. స్వాతంత్ర్య కాంక్ష కలిగిన జమిందార్ రంగారావుకి మిత్రుడు పింగళి వెంకయ్య పరిచయంతో కోట కేంద్రంగా స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది. అక్కడే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది.

నిజాం నవాబుకుకి భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలంతా భయపడుతున్నారు. అదే సమయంలో జమీందార్ రాజా నాయిని రంగారావు, పింగళి వెంకయ్య ఈ నడిగూడెం కోట నుండే ఉద్యమానికి ఊపిరి ఊదారు. దక్షిణ భారతదేశంలో మహాత్మాగాంధీకి ఉన్న ఏకైక ప్రియ శిష్యుడు. పత్తి వెంకయ్యగా పేరున్న పింగళి స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా, పౌరులను ఏకం చేసేందుకు ఒక జెండా కావాలని కోరినప్పుడు నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులతో తయారు చేసి మధ్యలో మహాత్మాగాంధీకి ఇష్టమైన నూలువడికే రాట్నం ఉంచారు. 1926లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది. అప్పటికే దేశం నలుమూలల నుండి 16 నమూనాలు వచ్చాయి. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో చిన్న మార్పులు చేసి రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు మహాత్మా గాంధీ. అప్పటి జాతీయ ఉద్యమ నాయకులకు సైతం వెంకయ్య జెండానే ఆకర్షించేంది. ఈ జెండాను పట్టుకునే ఉద్యమకారులు స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడారు. ఈయన కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వము కూడా గుర్తించడముతో ఈయనకు పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది.


నడిగూడెం కోటలో అలా జాతీయ జెండా రూపకల్పన ప్రాంతంగా కీర్తి దక్కింది పింగళి వెంకయ్య జాతీయోద్యమ సేవలకు గుర్తింపుగా 2009 సంవత్సరంలో కేంద్రం రూ.5 తపాలా బిళ్ళను విడుదల చేసింది. చారిత్రక ఘటనకు వేదికైన ఆనాటి ఈ రాజ భవనం నేడు మాత్రం పూర్తిగా శిధిలావస్ధకు చేరుకుంది. నాటి కళా నైపుణ్యం కళ్లకు కట్టేలా అద్భుతంగా తిర్చిదిదగా ఈ కట్టడంలో ఇప్పుడు ఆనవాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. రాజా వారసులు కోటను ఓ రీసెర్చ్ సెంటర్ కు అద్దె కు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వారు ఎవరిని కోటలోకి అనుమతించక పోవడంతో పర్యాటకులు నిరాశ తో వెనక్కి తిరుగుతున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బావి తరాలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. నడిగూడెం కోటను ఒక టూరిస్టు కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. అత్యంత విశిష్టత కలిగిన ఈ కోట ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సందర్శకులకు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed