Before, After.. 34 ఏండ్లలో అందం, ఆహ్లాదాన్ని పెంచిన ‘టీచర్’

by  |
Before, After.. 34 ఏండ్లలో అందం, ఆహ్లాదాన్ని పెంచిన ‘టీచర్’
X

దిశ, ఫీచర్స్ : రాజస్థాన్‌లో థార్ ఎడారిని ఆనుకుని ఉన్న జోధ్‌పూర్ సిటీ.. పలు ఆలయాలు, చారిత్రక ప్రదేశాలతో పాటు ఎన్నో కోటలకు ప్రసిద్ధి. ఇక్కడి వారసత్వ కట్టడమైన మెహ్రంగర్ కోట పరిసరాలు ఆ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను చేకూర్చగా.. ఈ కోట వేలాది చెట్లు, వందల రకాల పక్షి జాతులతో స్థానిక వన్యప్రాణులకు నిలయంగా ఉంది. అయితే ఒకప్పుడు ఎటుచూసినా ఎండిన చెట్లతో బంజరు భూమిని తలపించిన ప్రాంతంలో పచ్చదనానికి ప్రసన్నపురి గోస్వామి అనే టీచర్ కృషి చేశాడు. 34 ఏళ్ల కిందట ఆయన కన్న కలకు ఫలితంగా.. నేడు కోట చుట్టుపక్కల గల 22 హెక్టార్ల విస్తీర్ణం 50 వేల చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతోంది.

మెహ్రంగర్ కోట ప్రాంతానికి దగ్గరలోని ఖేజ్రి చౌక్‌ నివాసి అయిన 74 ఏళ్ల ప్రసన్నపురి.. చిన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పచ్చని చెట్లతో నిండిపోతే కోట మరింత అందంగా కనబడుతుందని అనుకునేవాడు. ఆ తర్వాత కోటకు కిలోమీటరు దూరంలోని ఒక గర్ల్స్ స్కూల్‌లో టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. పాఠశాల సమయం తర్వాత జశ్వంత్-తడ మధ్యన, మెహ్రంగర్ చుట్టుపక్కల చెట్లను నాటేవాడు. అయితే వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో మొక్కల సంరక్షణ కష్టమయ్యేదని తెలిపిన ప్రసన్నపురి.. తను పెరిగే క్రమంలో కరువు పరిస్థితుల నుంచి ఇప్పుడు వర్షాకాలంలో వరదలు ప్రవహించే వరకు అన్ని రకాల వెదర్ కండిషన్స్ చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఆయన చేస్తున్న పని రాయల్ ఫ్యామిలీ దృష్టికి రావడంతో ‘మహారాజ గజ్ సింగ్’.. తనకు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేశాడు. ఈ మేరకు స్పందించిన జిల్లా పరిపాలనా యంత్రాంగం.. 1995లో మొక్కలను సంరక్షించేందుకు 22 హెక్టార్ల చుట్టూ ఫెన్సింగ్ వేయించింది. వీరి సంరక్షణ చర్యలతో వందలాది మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా పెరిగాయి. ప్రసన్నపురి విజయంతో స్ఫూర్తిపొంది స్థానికులతో పాటు విద్యార్థులు ఈ ప్రయత్నంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ‘మెహ్రంగర్ పహాడి పర్యావరణ్ వికాస్ సమితి’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి పచ్చదనం కోసం పాటుపడుతున్నారు.

ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నా..

నీటి అవసరం తక్కువగా ఉండే ముళ్ల చెట్లు, గుబురు చెట్లను పెంచడం ప్రారంభించాను. కొండప్రాంతాల్లో నీటి సదుపాయం లేకపోవడంతో సమీపంలోని ప్రదేశాల నుంచి సరఫరా చేయాల్సి వచ్చేది. ఇక వేసవిలో అయితే బాటిళ్లలో తీసుకెళ్లి మరీ చెట్లు ఎండిపోకుండా కాపాడేవాణ్ని. తన ప్రయత్నాలను చూసి స్థానికులు నవ్వినా పట్టించుకునేవాన్ని కాదు. ఈ క్రమంలోనే కొందరు గిట్టనివారు రాత్రికిరాత్రే 200 మొక్కలను పీకేశారు. ఓ వైపు స్థానికులు తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే.. చెట్ల కోసం నీళ్లు వృథా చేస్తున్నావని ప్రశ్నించేవారు. అలా ఎన్నో అడ్డంకులు దాటుకుని ప్రస్తుతం తన కలను నెరవేర్చుకున్నా.- ప్రసన్నపురి, టీచర్

లక్ష్య సాధనలో వెంటాడిన దురదృష్టం..

2005లో ప్రసన్నపురి జాలోర్ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ కావడంతో మొక్కల బాధ్యతను తన కొడుకుకు అప్పగించాడు. అయితే ఒకరోజు మొక్కలకు పెస్టిసైడ్స్ స్ర్పే చేస్తూ స్పృహతప్పి పడిపోగా, ఆస్పత్రిలో రెండు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఆ సంఘటన తనను పర్యావరణం, మొక్కల పట్ల మరింత జాగ్రత్తగా ఉండేలా చేసింది. ఇప్పుడు వీటిలోని కొన్ని చెట్లకు తన కుమారుడి వయసే ఉండగా.. నిజంగా వాటిని తన పిల్లల వలెనే చూసుకుంటున్నాడు ప్రసన్నపురి.

ప్రకృతితో మమేకమయ్యే అవకాశం..

ప్రస్తుతం మినీ ఫారెస్ట్‌ను తలపిస్తున్న మెహ్రంగర్ కోట పరిసరాల్లో అనేక 195 జాతులు పక్షులతో పాటు ముళ్ల పందులు, పందికొక్కులు, గుడ్లగూబలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులకు ఆలవాలంగా ఉంది. అంతేకాదు 130 రకాల ఔషధ మూలికలు, వందల పండ్ల చెట్లతో కూడిన పూర్తి పర్యావరణ వ్యవస్థ.. ఇక్కడి మట్టి నాణ్యతను పెంచేందుకు తోడ్పడుతోంది.

Next Story

Most Viewed