నిరసనలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అస్వస్థత

by  |
MLC Jeevan reddy
X

దిశ, జగిత్యాల : పెట్రోలు ధర పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మన్ ఆధ్వర్యంలో జగిత్యాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల యువ నేతలు హాజరయ్యారు. నిరసన ప్రదర్శనలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు తాళ్లతో ఆటోను లాగి నిరసనలు తెలిపారు. ఇంటి నుంచి కొత్త బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, అనంతరం పెట్రోల్ బంక్ ఎదుట రోడ్డుపై బైటాయించి జీవన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల అనేక రంగాలపై అధిక భారం పడుతుందని, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతుండగా.. పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు అడ్డుకోవడంతో పోలీసులకు, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ మధు గౌడ్, రఘువీర్ గౌడ్‌కు గాయాలయ్యాయి.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి‌ని అరెస్ట్ చేసి వాహనం వద్దకు తరలిస్తుండగా, స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళన చెందాయి. 200 మంది కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసులు.. పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కొత్త బస్టాండ్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. అలాగే జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Next Story

Most Viewed