నిబంధనలకు తూట్లు.. వీడీసీల ముసుగులో అక్రమాల జాతర

by  |
Illegal sand smuggling
X

దిశ, మల్లాపూర్: గ్రామ అభివృద్ధి పేరిట ఏర్పడిన కమిటీల ముసుగులో అక్రమాల జాతర సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఆదాయం కోసం వీడీసీలు తీసుకుంటున్న చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, జిల్లాలో జరుగుతోన్న ఈ వీడీసీలను నియంత్రించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలకు కూడా బహిరంగంగానే వేలం వేస్తున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది. మల్లాపూర్ మండలం ఆనుకొని ప్రవహిస్తోన్న గోదావరి తీరం నుండి ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగిస్తుండటం గమనార్హం.

మండలంలో బడి-గుడి అభివృద్ధి పేరిట బహిరంగంగా వీడీసీలు వేలం నిర్వహించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అక్రమ ఇసుక రవాణా కోసం వేలంపాట నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సి ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా అధికార యంత్రాంగం నిస్సాహాయ స్థితిలో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీడీసీల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినప్పటికీ వారిపై మాత్రం చర్యలు తీసుకునే వారు మాత్రం కరువయ్యారని స్పష్టం అవుతోంది. యథేచ్ఛగా సాగుతున్న వీడీసీల అక్రమ వ్యాపారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మా దృష్టికి రాలేదు : తహసీల్దార్

వాల్గొండలో వీడీసీల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండా సాగుతున్న ఇసక తవ్వకాల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని మల్లాపూర్ ఎమ్మార్వో రవీందర్ తెలిపారు. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేస్తే తాము పోలీసులకు రెఫర్ చేస్తామని అప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రాత్రిళ్లు గస్తీ చేస్తున్నాం : ఎస్ఐ రాజేందర్

అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయడం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామని స్థానిక ఎస్ఐ రాజేందర్ తెలిపారు. రాత్రి రెండు గంటల వరకు గస్తీ చేస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story