బెల్టు షాపులకు వరంగా లాక్‌డౌన్

by  |
బెల్టు షాపులకు వరంగా లాక్‌డౌన్
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్రమంగా మద్యం అమ్ముకునే వారికి వరంగా మారింది. ఇదే అదునుగా భావించిన పలువురు వ్యాపారులు దొడ్డిదారిలో మద్యాన్ని విక్రయిస్తుండటంతో మద్యం ప్రియులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ప్రకటనకు ఒకరోజు ముందే ఉమ్మడి జిల్లాలో రూ.10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరగడంతో మద్యం మొత్తం బెల్ట్ షాపులకు తరలించారనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా టార్గెట్ పూర్తి కావల్సిన నేపథ్యంలో చూడనట్టు వ్యవహరించారనేది గమనించాల్సిన అంశం.

ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో బెల్ట్ షాపులు, ఇతర ప్రాంతాల్లోని కిరాణా షాపుల్లో మద్యం నిల్వలు ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. మామూలు రోజుల్లో కంటే రెండింతలు రేట్లు పెంచి విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు షాపులను సీల్ చేయగా, ఎవరైనా షాపులను తెరిచేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్లమ్ ఏరియాల్లో మద్యం విక్రయాలు విపరీతంగా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే షాపుల్లో ఉండాల్సిన మద్యాన్ని ముందుగానే యజమానులు ఇతర ప్రాంతాలకు తరలించి దొంగచాటుగా విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గోదాంలలో ఉండాల్సిన సరుకును లాక్‌డౌన్‌కు ముందు రోజు రాత్రే వివిధ ప్రాంతాలకు తరలించి, అక్కడి నుండి కావాల్సిన మేర మద్యంను తీసుకువచ్చి అమ్ముతున్నారు. అటు అధికారులంతా కరోనా విధుల్లో నిమగ్నమై ఉండటంతో అక్రమంగా మద్యాన్ని విక్రయించే వారు రెచ్చిపోతున్నారు.

Tags: Corona Virus Effect, Lockdown, Wine Shop, Belt Shop, Merchants, Mahabubnagar, Slum Area

Next Story