మందుబాబుల కుతి.. అక్రమార్కుల కక్కుర్తి?

by  |
మందుబాబుల కుతి.. అక్రమార్కుల కక్కుర్తి?
X

దిశ, ఆదిలాబాద్: అన్నిటికి లాక్‌డౌన్ ఉందిగానీ గుడుంబాకు మాత్రం లేదెందుకో? మద్యం షాపులు షట్‌డౌన్ కావడంతో మందు దొరక్క మందుబాబులు గుడుంబా బాబులుగా మారిపోయారు. మందుబాబుల కుతి అక్రమార్కులకు కక్కుర్తిగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల నుంచి ఇప్ప పువ్వు తీసుకుని, వాటికి రసాయనాలు కలిపి గుడుంబా తయారు చేస్తున్నారు. ఇప్పపువ్వు‌ ఆవిరి‌తో వచ్చే మత్తును తీసుకుంటే ఎలాంటి రోగం రాదని ఆదివాసులు భావిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు నల్లబెల్లం, పటిక, ఇతర రసాయనాలు పులియబెట్టి, అందులో కొంత ఇప్పపువ్వు వేసి గుడుంబాగా తయారు చేస్తున్నారు. బైక్‌‌‌‌లు, ఆటోల ద్వారా దొంగచాటుగా పట్టణాలకు గుడుంబాను సరఫరా
చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఎక్కడెక్కడ…

నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్, కుభీర్, కుంటాల, సారంగాపూర్ మండలాల్లో, మంచిర్యాల జిల్లా, హాజీపూర్​ మండలం గడ్‌‌‌‌పూర్, మందమర్రి మండలం పులికుంట, దండేపల్లి మండలం లింగాపూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గుడుంబా వస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎక్సైజ్ శాఖ నజర్

గుడుంబా దందాకు ఇప్పుడు మార్కెట్లో భారీ ధర పలుకుతోంది. గతంలో లీటరు ప్యాకెట్ వంద రూపాయలకు విక్రయించగా, ఇప్పుడు లీటరుకు రూ.1,000 చొప్పున అమ్ముడవుతోంది. కొంతమంది ధనవంతులు కూడా మద్యం దొరక్క ఇప్పపువ్వు తెప్పించుకొని సారా కాచుకుని తాగుతున్నారని తెలుస్తోంది. ఈ సంగతి పోలీసులకు కూడా తెలుసు. అయితే గుడుంబా నియంత్రణపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. లాక్‌డౌన్‌ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల్లో 200కుపైగా కేసులు నమోదు చేశారు. సుమారు రెండున్నర వేలకుపైగా లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. 6 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికే వంద మందికిపైగా వ్యక్తులను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు భారీగా వాహనాలను పట్టుకున్నారు. అయితే గుడుంబా దందాపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

Tags: lock down, covid 19 effect, illegal, making of gudumba, police, excise, dept, arrest



Next Story

Most Viewed