కాలం చెల్లిన వాహనాలతో అక్రమాలు

by  |
కాలం చెల్లిన వాహనాలతో అక్రమాలు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: వెనుక నుంచి ఏనుగులు మాయమైనా ఫర్వాలేదు కానీ.. కళ్లెదుట ఎలుక పిల్ల కూడా దాటిపోరాదు అన్నట్లుగా తయారైంది భూపాలపల్లి, ములుగు జిల్లాల రవాణా, పోలీస్, మైన్స్ మ‌రియు జియాలజీ శాఖ అధికారుల తీరు. జీవిత బీమా, కాలుష్య నియంత్రణ, వాహన ఫిట్‌నెస్, ఇతర రహదారి భద్రతా నియమాల పేరిట రోడ్లపై నిత్యం పౌరుల వద్ద తనిఖీలు చేపట్టే రవాణా శాఖ, పోలీసు యంత్రాంగానికి కాలం చెల్లిన లారీలు, నెంబరు ప్లేట్లు కూడా లేకుండా కళ్లెదుటే యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతుంటే పట్టించుకోవడం లేదు. డ్రైవ‌ర్ల‌కు కనీసం లైసెన్సులు కూడా లేవన్న ఆరోపణలు ఉన్నాయి.

బీమా, కాలుష్య నియంత్రణ, లైసెన్సులు లేని వందలాది లారీలను వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి మండలాల పరిధిలో రాత్రి వేళల్లో గోదావరి నదీ తీరంలోని ఇసుక ర్యాంపుల వద్ద అద్దెకు ఇస్తున్నారు. వాస్తవానికి ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లించి, స్లాట్ బుక్ చేసుకొని అన్ని రకాల అనుమతులు ఉన్న లారీల ద్వారానే ఇసుక రవాణా చేపట్టాలి. కానీ సుమారు 100 వరకు కాలం చెల్లిన 12, 14, 18 టైర్ల భారీ లారీలను పెట్టి, ప్రతి లారీలో 25-35 టన్నుల మేరకు ఇసుకను నింపి (ఓవర్ టన్నెజ్) తరలిస్తున్నారు. ఫలితంగా టన్నుకు కనీసం 1000 చొప్పున ఒక్కో లారీకి అదనంగా రూ.25-35 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా తరలిస్తున్న ఇసుకను ములుగు జిల్లా పరిధిలోని మల్లంపల్లి వద్ద ఇతర లారీల్లోకి మార్చి వరంగల్, జనగాం, భువనగిరి, హైదరాబాద్ తరలిస్తున్నారు.

అక్రమంగా నిల్వ

లారీలపై తాటిపత్రులు, కవర్లు కప్పకుండా హైదరాబాద్- భూపాలపట్నం, తాడ్వాయి-భూపాలపల్లి- పరకాల-వరంగల్ మార్గంలో శరవేగంగా వెళ్తున్నాయి. స్థానిక అవసరాల పేరిట కొన్నిసార్లు రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకొని, వందల టన్నుల ఇసుక అక్రమంగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ నూతన మైనింగ్ పాలసీ ప్రకారం అక్రమ రవాణా చేస్తే.. మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి రెండింతలు జరిమానా, మూడోసారి ఏకంగా వాహనాలను జప్తు చేసి, డ్రైవర్ల లైసెన్సులు కూడా రద్దు చేయాలి. కానీ, తనిఖీలు నిర్వహించకపోవడంతో జరిమానాలు విధించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

తనిఖీలు ఏవీ?

ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్రమ జీరో దందా జరుగుతున్నా సంబంధిత మోటార్ వెహికల్ ఇన్‌స్పె‌క్టర్లు, రెవెన్యూ అధికారులు, విజిలెన్సు, గనులు & భూగర్భ శాఖల అధికారులు నేటికీ ఎక్కడా తనిఖీలు చేపట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు ఏటా లక్షలాది రూపాయలు పెట్టి బీమా, వెహికల్ ఫిట్‌నెస్, ఇతర నిర్వహణ పరమైన వ్యవహారాలూ చూసే లారీల యజమానులను మాత్రం అధికారులు అనేక టెండర్లు నిర్వహించి, నిబంధనలు విధించి ధాన్యం సేకరణ, తదితర రవాణా వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తుండగా.. కాలం చెల్లిన వాహనాలతో జీరో దందాలు చేస్తున్నారు.

అభివృద్ధి పనుల పేరుతో..

జిల్లా వ్యాప్తంగా జ‌రుగుతున్న వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల కూప‌న్ల‌ను చూపుతూ ఇసుక‌ను రీచ్‌ల నుంచి త‌ర‌లిస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధిపనుల పేరుతో అధికారిక రీచ్ ల నుంచి తీసుకెళ్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల పేర్లు చెప్పి భారీ ఎత్తున ఈ దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.



Next Story

Most Viewed