అధికారులకు కాసులు కురిపిస్తున్న కమర్షియల్ దందా..

by  |
అధికారులకు కాసులు కురిపిస్తున్న కమర్షియల్ దందా..
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగుతున్న ఇల్లీగల్ ఇటుక వ్యాపారం ఆయా శాఖల అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. హరితహారంలో పెరిగిన వృక్షాలను దర్జాగా నరికి సాగు భూమిలో నల్ల మట్టితో కొందరు బడా నేతల కనుసన్నల్లో వ్యాపారులు ఇటుక దందా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఇటుక వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి కన్నం పెడుతున్నారు. పట్టా భూమిని నాన్ అగ్రికల్చర్ కింద నమోదు చేసుకున్న తర్వాత ఇటుకల వ్యాపారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయా పంటలను సాగు చేస్తున్నట్లు గానే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం రైతుబంధు కూడా ఇచ్చి వారికి మద్దతు ప్రకటిస్తున్నారు.

కౌలుకు తీసుకొని రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించిన రైతులను కూడా మరచిన ప్రభుత్వం ఇటుక వ్యాపారులకు మాత్రం రబీ, ఖరీఫ్‌లలో పంట సాయం అందిస్తోంది. విద్యుత్ శాఖ నుండి కూడా అనుమతులు పొందకుండా రైతులు పొందే ఉచిత కరెంటును సాఫీగా వాడుతున్నారు. అందులో పనిచేసే కార్మికులకు సైతం కార్మిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చిన కూలీల చిన్నారులతో కూడా పని చేయిస్తూన్నారు. హరితహారం కింద పెట్టిన మొక్కలను, వృక్షాలను అడ్డగోలుగా నరికి ఇటుక తయారీకి కాల్చుతున్నారు. దీంతో వతవరణం సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి అన్ని కోణాల్లో ఆయా శాఖలను మోసగిస్తూ.. చివరికి తయారు చేసిన ఇటుకలను కూడా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

అధికారులకు కాసుల వర్షం..!

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ఇటుక తయారీ వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టా భూమిలో ఇటుక వ్యాపారం చేసేవారు మొదటగా నాన్ అగ్రికల్చర్ కింద పాస్ పుస్తకాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఆర్డీవో లు విచారించి రద్దు చేయాల్సి ఉంది. ఇటుక తయారీకి వినియోగించే విద్యుత్ కనెక్షన్ కోసం ప్రభుత్వానికి డిడి చెల్లించాల్సి ఉంది. యూనిట్ కాస్ట్ కూడా పెరగడంతో విద్యుత్ శాఖ ఆదాయం పెరుగుతుంది. లేబర్ డిపార్ట్మెంట్ అనుమతి కోసం కొంత నగదు చెల్లించాల్సి ఉంది. దీంతో అందులో పనిచేసే కార్మికులకు మేలు జరుగుతుంది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా వారి నుండి ప్రతి నెలా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రధాన రోడ్ల వెంట ఇటుక బట్టలు కనిపిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతుందని చెబుతున్నారు. పట్టా పాసుపుస్తకం ఉండటంతో వ్యవసాయ అధికారులు రైతు బంధు పథకం కింద నగదు బదిలీ చేస్తున్నారు. ఆయా బ్యాంక్ అధికారులతో రుణం కూడా పొందుతున్నారు.

సామాన్యులకు అందని ఇటుకలు.

ప్రతి సామాన్యుడు తన స్వంత ఇంటి కలను నిజం చేసుకోవడం కోసం వినియోగించే ఇటుకలు తక్కువ ధరకు అందడం లేదు. ఒక్కో ఇటుకను 2 రూపాయలు పెంచడంతో ట్రాక్టర్ ఇటుక పెల్ల పదివేలకు పైనే పలుకుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇల్లీగల్ ఇటుక బట్టీలను గుర్తించి నిబంధనలు వర్తింపజేస్తే ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు రైతు బంధు నగదు మిగులుతుందని చెబుతున్నారు.

Next Story

Most Viewed