అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారం.. ఏమీ పట్టని అధికారులు..

by  |
అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారం.. ఏమీ పట్టని అధికారులు..
X

దిశ, దమ్మపేట: దమ్మపేట మండలంలో ఇటుక బట్టీలు ఇష్టారీతిగా వెలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం పలు శాఖల అనుమతుల మేరకే వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నిబంధనలు గాలికి వదిలేసి, ఇటుక బట్టీలు నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్నారు. దమ్మపేట మండలంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం ప్రకారం పరిశ్రమలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి ఉండదు. అయితే నిర్వాహకులు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పలువురు అమాయకపు రైతుల దగ్గర నుండి భూములు లీజుకు తీసుకొని ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నారు.

జాతీయ రహదారి పక్కనే ఇటుక బట్టీలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు నిర్వహించాలంటే ముందుగా గ్రామ పంచాయతీ, భూగర్భ గనులు, కాలుష్య నియంత్రణ అధికారుల వద్ద నుండి అనుమతులు పొందాలి. ప్రజల నివాస ప్రాంతానికి 1 కిలో మీటరు దూరంలో ఏర్పాటు చేయాలి. పంట పొలాలకు కనీసం వంద మీటర్ల దూరంలో ఉండాలి. ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. ఇటుకను కట్టెలు, ఇసుకతో మాత్రమే కాల్చాలి. ఇటుకను కాల్చిన తరువాత వచ్చే బూడిదను నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలి. కానీ ఇవేమి పాటించడం లేదు.

అనుమతులు లేకుండా చెరువుల నుండి మట్టి సేకరణ.

ఇటుక బట్టీకి మట్టి కావాలంటే రెవెన్యూ అధికారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ చెరువులో ఉన్న మెత్తటి మట్టిని దర్జాగా సేకరించి పెద్ద పెద్ద గుట్టలుగా నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతుల్లేని ఇటుక బట్టీలు నిర్వహణపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



Next Story