డ్రోన్‌తో వ్యాక్సిన్ డెలివరీ.. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అధ్యయనం

by  |
డ్రోన్‌తో వ్యాక్సిన్ డెలివరీ.. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం అని అందరూ నమ్ముతున్నారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా టీకాలను మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వడానికి నిర్ణయిస్తేనే తగినన్ని టీకాలు అందుబాటులో లేని పరిస్థితి. మరి ఇప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలంటే.. సాధ్యమనేనా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు దేశవ్యాప్తంగా టీకా సప్లయ్ చేయడం కూడా ఓ పెద్ద సమస్యే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. దేశవ్యాప్తంగా అవసరమైన COVID-19 టీకాలను అందించేందుకు డ్రోన్లను ఉపయోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ అధ్యయనాన్ని నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

డ్రోన్ ద్వారా టీకా సరఫరా సాధ్యసాధ్యాలపై చేస్తున్న అధ్యయనానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), భారతీయ వైద్య మండలికి అనుమతి ఇచ్చినట్లు కొత్త నివేదిక వెల్లడించింది. ఈ నిర్దిష్ట అధ్యయనం కోసం ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌తో ఐసీఎంఆర్ జతకట్టింది. ఈ మేరకు డ్రోన్‌ల టెస్టింగ్‌ను క్యాంపస్‌లోనే నిర్వహించనున్నారు. కాగా అధ్యయన మొదటి దశలో, డ్రోన్‌ను ఆపరేటర్ దృష్టి(ఇన్‌సైట్ ఆఫ్ ది ఆపరేటర్)లో ఉంచనున్న పరిశోధకులు.. ఒకవేళ ఇది విజయవంతమైతే డ్రోన్‌ను దృష్టి రేఖ(బియాండ్ ద లైన్ ఆఫ్ సైట్)కు మించి ఆపరేట్ చేస్తారు. మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనలు-2021 ప్రకారం ప్రత్యేక ‘షరతులతో కూడిన మినహాయింపు’ కింద అధికారులు డ్రోన్‌ అధ్యయనానికి అనుమతి మంజూరు చేశారు. కాగా డ్రోన్ ద్వారా వ్యాక్సిన్ డెలివరీకి మరెంతో కాలం పట్టదని, అతి త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఐసీఎంఆర్ అధికారుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed