కోర్టుకు పోయొస్తే.. నగ్నంగా నిలబడాల్సిందే..

by  |
Female prisoners
X

మహిళా వార్డు

మా శరీరాల కొలతలు దీసుకు
మాకు(నలభై ఐదు మందికి)
ఈ గదిని కేటాయించారు..

జైలు మ్యాన్యువల్
గాలికెగిరిపోయేచోట
అధికారుల కొనచూపులే
శాసనాలయ్యేచోట
మాకు
మా శరీరాల మీద
మా భావోద్వేగాల మీద
ఏ హక్కూ ఉండదు..

కోర్టు పేషీకి పోయి వొస్తామా..
మహిళా గార్డుల ముందు
నగ్నంగా నిలబడవల్సిందే
తాకరానిచోట తాకుతూ ఉంటే
మౌనంగా భరించవల్సిందే

నెలసరి మినహాయింపులు
ఎడారిల ఒయాసిస్సులే

పైకప్పుకు వేలాడే
ఒకే ఒక్క ముసలిఫ్యాను
మా ఉక్కబోత శరీరాల జూసి
బోసినవ్వు నవ్వుతుంటది
అటాచ్ డ్ టాయ్ లెట్ రూము
మతవాది విషప్రచారంలా
ఎగజిమ్మే దుర్గంధం
పేగుల్ని తోడేస్తుంటది.
ఎండాకాలమొస్తే
ఒక్కబకెట్ నీళ్ళతో నలుగురి స్నానం
నాగరీకుల ఊహకందని వైనం

పురుగుల అన్నం, పులుసూ చారూ
ఆకలిపేగులకిట ఓదార్పులు..
ఇక్కడ
ఏపుటకాపూట
బతికుండడమే పెద్దఫీట్

బహిష్ఠులు, రక్తస్రావాలు, అబార్షన్లు
రాని డాక్టర్లు, దొర్కని మందులు
ఏడ్పులు,వాదనలు,అరుపులు
జైలు గార్డుల తిట్లు,బూతులు
వెరసి..ఇదొక మహిళావార్డు

నియంతల పాలనలో స్వతంత్రంలాగ
ఇక్కడ ప్రశాంతత … ఓకల.
ప్రైవసీ..ఒక ఫాంటసీ..

ఏ సంగీతమూ తెలువనిమాకు
రాత్రయితేచాలు..
దోమలసంగీతం చుట్టు ముడుతది..
అది
సాంప్రదాయాల పేరుమీద
కులమతాల పేరుమీద
ఆస్తుల అంతస్తుల,ఆక్రమణలమీద
జైళ్ళకేసి తరిమేయబడ్డ
అభాగ్యుల, అన్నార్తుల
మూగరోదనల్ని వినిపిస్తది

అనేక వైతరణుల దాటి
అట్లా కంటి మీద రెప్పవాల్తుందోలేదో
జైలుగార్డులు
తలుపులు బాదేస్తుంటారు..

– ఉదయ మిత్ర, విరసం
(Presidential correctional home ,calcutta మహిళలకు…)


Next Story

Most Viewed